రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దహనం చేయడంపై మండిపడుతూ షర్మిల ట్వీట్
- దిష్టిబొమ్మలే కాదు గోద్రా, మణిపూర్ లను తగలబెట్టించిన చరిత్ర మోదీదని తీవ్ర వ్యాఖ్యలు
- ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందంటూ హెచ్చరిక
- మణిపూర్ తగలబడుతుంటే అక్కడ పర్యటించే ధైర్యంలేని మీరా దేశానికి మంచిచేసేదంటూ నిలదీసిన షర్మిల
వీరోచిత పోరాటపటిమ, అద్భుత వాగ్ధాటి, మనసా వాచా కర్మణా దేశం, ప్రజల కోసమే నిలబడే నిస్వార్థ చింతన వంటి గొప్ప లక్షణాలు ఉన్న రాహుల్ గాంధీని అవమానించడం ద్వారా ఏం సాధించాలని అనుకుంటున్నారని మోదీని ప్రశ్నించారు. ‘మీ నీచ రాజకీయాలు, మోసపూరిత చర్యలు, ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను యావత్ దేశం గమనిస్తోంది. మీ మాయమాటలకు మోసపోయేంత అమాయకులు కారు ప్రజలు. మణిపూర్ తగలబడుతూ ప్రజల భవిత సర్వనాశనం అవుతుంటే అక్కడ పర్యటించలేని పిరికి ప్రభుత్వం మీది. మీరా దేశానికి మంచి చేసేది? మీరా రాజ్యాంగం గురించి మాట్లాడేది?’ అని నిలదీశారు. దిష్టి బొమ్మలే కాదు, గోద్రా, మణిపూర్ లను కూడా తగలబెట్టించిన నైజం మోదీదని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.