కర్ణాటకలో 15వ శతాబ్దం నాటి రాతి స్తూపం లభ్యం
- అరసళే రాజు పేరిట శాసనం
- 1442 సంవత్సరం నాటి రాతి స్తంభం
- నాడు తిరుమల ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు గుర్తింపు
ఈ శాసనంతో కూడిన స్తంభం ఓ ఆలయం వద్ద పడి ఉండడాన్ని నాదుపల్లి గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న కేఆర్ నరసింహన్ తన సహ చరిత్రకారుడు ధన్ పాల్ తో కలిసి నాదుపల్లి గ్రామానికి వచ్చారు. స్థానికుల సాయంతో ఆ స్తంభాన్ని వెలికి తీసి, శుభ్రం చేశారు. ఆ స్తూపంపై 'కంభ సేవె' (వైష్ణవ ఆలయానికి విరాళంగా ఓ స్తంభం) వివరాలు ఉన్నట్టు కేఆర్ నరసింహన్ తెలిపారు. కన్నడ భాషలో ఎనిమిది పంక్తులు రాసి ఉన్నాయని వెల్లడించారు.
ఈ స్తంభం సహజంగా ఆలయాల ముందు నిలిపే ధ్వజస్తంభం వంటిదని, దీన్ని గరుడ కంభగా పిలుస్తారని ఆయన వివరించారు. ఈ స్తూపాన్ని తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా ఇచ్చినట్టు, దానిపై చెక్కిన శాసనం ద్వారా తెలుస్తోందని కేఆర్ నరసింహన్ వెల్లడించారు. 1442లో ఆరసళే రాజు పేరిట ఈ శాసనం ఉందని పేర్కొన్నారు. మతపరమైన చిహ్నాలు శంఖము, గరుడ, చక్రము, నామాలు దీనిపై చెక్కారని తెలిపారు.
కాగా, ఈ శాసనం చాలా విలక్షణంగా ఉందని, సహజంగా శిలాశాసనాలు అడ్డంగా పొందుపరుస్తారని, కానీ నాదుపల్లిలో లభ్యమైన స్తంభంపై శాసనం మాత్రం నిలువుగా ఉందని కేఆర్ నరసింహన్ వెల్లడించారు.