Shashi Tharoor: ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమేమీ కాదు: శశి థరూర్

Shashi Tharoor says emergency is undemocratic not unconstitutional
షార్ట్స్‌లో చూడండి
ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం మాత్రం కాదని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. అయితే, ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ చర్యలను మాత్రం ఆయన ఖండించారు. ఎమర్జెన్సీ పేరిట ప్రజల దృష్టి అసలు సమస్యలపై నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తోదంటూ బీజేపీపై దుమ్మెత్తిపోశారు. తిరువనంతపురం ఎంపీగా ఇటీవలే నాలుగోసారి ఎన్నికైన ఆయన మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, స్పీకర్ ఓం బిర్లా ప్రసంగాల్లో ఎమర్జెన్సీ ప్రస్తావనపై స్పందించిన శశిథరూర్... 49 ఏళ్ల నాటి ఘటనను బీజేపీ మళ్లీ ఎందుకు తిరగదోడుతోందని ప్రశ్నించారు. వాస్తవం గురించి మాట్లాడకుండా బీజేపీ 2047 లేదా 1975 నాటి ఘటనల గురించే మాట్లాడుతోందని విమర్శించారు. ఒకప్పుడు రాజ్యాంగంలో అంతర్గత ఎమర్జెన్సీ విధింపునకు అవకాశం ఉండేదని, కాబట్టి అప్పట్లో ఆ నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని అన్నారు. ప్రస్తుతం దాన్ని తొలగించారని అన్నారు. కాబట్టి, చట్టపరంగా చూస్తే ద్రౌపది ప్రసంగంలో ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమనడం సరికాదని అన్నారు. 

బ్రిటిష్ నుంచి భారత్‌కు అధికారం బదలాయింపునకు చిహ్నంగా ఉన్న సెంగోల్‌కు బదులు రాజ్యాంగం కాపీని తీసుకురావాలన్న ఎస్పీ వాదనపై కూడా శశిథరూర్ స్పందించారు. సెంగోల్‌కు అనుకూల ప్రతికూల వాదనలు రెండూ ఆమోదించదగ్గవేనని అన్న ఆయన ఈ విషయంలో తాను తటస్థంగానే ఉండదలచినట్టు వివరించారు. 

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీపై కూడా శశిథరూర్ స్పందించారు. రాహుల్ ఓ నాయకుడిగా ఎదిగారన్నారు. భారత్ జోడో యాత్రలతో పరిస్థితి మారిందన్నారు. యువత దృష్టి ఆయనవైపు మళ్లిందన్నారు. రాహుల్ తన సూచనలు తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన నాయకుడిగా మంచి విజయాలు సాధిస్తున్నాడని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల కోసం పనిచేసే అద్భుత అవకాశం రాహుల్‌కు దక్కిందని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Shashi Tharoor
Emergency
Congress
BJP
INDIA Bloc
NDA

More Telugu News