ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh review with education officials
  • పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష
  • ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దన్న మంత్రి
  • ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుదలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం
ఇకపై ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా విధివిధానాలను రూపొందించాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్‌ల భారాన్ని తగ్గించి, పూర్తిస్థాయి బోధనపై దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రాబోయే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.

పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను ఆరా తీశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు బదిలీ కావడానికి గల కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపునకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. విద్యా ప్రమాణాల పెంపునకు దేశంలో అత్యుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు. 

ఈ సందర్భంగా జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను మంత్రి ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది? ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలి? అనే అంశాల పైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమీక్షా సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Teachers

More Telugu News