కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే నేడు కీలక భేటీ
- జూన్ 4న కౌంటింగ్‌కు సన్నద్ధత, వ్యూహాలపై చర్చ
- అభ్యర్థులకు సూచనలు చేయనున్న పార్టీ అధిష్ఠానం
- మధ్యాహ్న సమయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశానికి నిర్ణయం
- వర్చువల్‌గా జరగనున్న భేటీలో పాల్గొననున్న ముఖ్యనేతలు
ఈ వర్చువల్ మీటింగ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, ఇతర అగ్రనేతలు ఉండనున్నారని తెలుస్తోంది. కాగా శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా కూటమి నేతలు ఇప్పటికే సమావేశమయ్యారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ-ఎం, సీపీఐ, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్‌జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(శరద్ పవార్) సహా పలు పార్టీల విపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే టీఎంసీ, పీడీపీ ప్రతినిధులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇలా..
మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా మెజారిటీ స్థానాలు ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. ఎన్డీయే కూటమి 371 నుంచి 401 స్థానాలు గెలుపొందవచ్చునని అంచనా వేశాయి. బీజేపీ ఒంటరిగా 319-338 సీట్లు గెలుస్తుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ అంచనా వేసింది. ఇక తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు రావొచ్చని లెక్కగట్టింది. ఈసారి దక్షిణాదిలో అనూహ్య స్థాయిలో ఎన్డీయే కూటమి సీట్లు సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.