సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడిన కిషన్ రెడ్డి
- రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శ
- బీజేపీ అజెండాలో లేని అంశాలను కూడా తమపై రుద్దే ప్రయత్నం చేశారని ఆగ్రహం
- ఎక్కువ మంది ఏపీకి వెళ్లడంతో ఓటింగ్ శాతం తగ్గిందన్న కిషన్ రెడ్డి
తెలంగాణలో పోలింగ్ సమయం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లో కొంత పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఓటింగ్ శాతం తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు. ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేందుకు, ఓటింగ్ సరళని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారని తెలిపారు. అందుకే హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.
బీజేపీకి తెలంగాణలో అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాహాటంగా చెప్పారన్నారు. ఈసారి పట్టణప్రాంతవాసులే కాదు గ్రామాల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఈసారి కొత్త శక్తిగా అవతరిస్తుందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఒక్కో హామీని అమలు చేస్తామన్నారు. మోదీని తీసుకువచ్చి సమ్మక్క సారక్క గిరిజన విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు... కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాడుతూ... రెండంచెల వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.