ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు... కానీ...!: కడపలో చంద్రబాబు

Chandrababu targets CM Jagan in Kadapa
కడపలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... జగన్ ను తాను ముద్దుగా సైకో అని పిలుచుకుంటానని వెల్లడించారు. 

ఎందుకంటే... ఈ వ్యక్తి ఒక అహంకారి... నేను రాజశేఖర్ రెడ్డిని చూశాను, 45 ఏళ్లు రాజకీయాలు చేశాను... ఇలాంటి వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదు... ఆయన తీరు ఒక సైకో లాగా ఉంటుంది అని వివరించారు. 

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడుకును భరించలేక బెంగళూరు పంపించేశాడని వెల్లడించారు. చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వనివాడు, కన్నతల్లికి తిండి పెట్టని వాడు నీకు నాకు ఏమైనా చేస్తాడా? గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి... ముఖ్యంగా విధ్వంసకారుడు అని వివరించారు. 

ఇలాంటివాడు ఒక ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది, ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. 

"ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది ఇదే. ఇతడొక దోపిడీదారుడు, ఒక బందిపోటు. మొత్తం సంపద అంతా ఇతడికే కావాలి. ఇంత బరితెగించిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఇసుక మొత్తం దోచేశాడు. ఇతడు నాటకాల్లో దిట్ట. మోసాల్లో చాలా తెలివైనవాడు. నేరాలు ఘోరాలు చేయడంలో పీహెచ్ డీ చేశాడు... అభివృద్ధి చేయడంలో జీరో. 

ఈయన నవరత్నాలు అంటున్నాడు... ఆ నవరత్నాలు ఏంటో తెలుసా...? నవరత్నాల్లో ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం ప్రజల ఆస్తుల కబ్జా, ఏడో రత్నం ప్రభుత్వం టెర్రరిజం-సెటిల్మెంట్లు, ఎనిమిదో రత్నం దాడులు-కేసులు, తొమ్మిదో రత్నం శవరాజకీయాలు-డ్రామాలు-గులకరాళ్ల నాటకాలు... ఇవీ ఈయన రత్నాలు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలా? అందుకే ఏమీ చెప్పుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. 

ఇవాళ మాట్లాడుతున్నాడు... ఆయన భూమి ఇస్తాడంట... భూమిని కొట్టేయడంట... మరి ఇడుపులపాయలో 360 ఎకరాలు కొట్టేసింది మీ కుటుంబమే కదా! అనంతపురం జిల్లా లేపాక్షిలో 10 వేల ఎకరాలకు టెండర్ పెట్టాడు. గుంటూరులో వాన్ పిక్ సిటీ 28 వేల ఎకరాలకు టెండర్ పెట్టాడు. కడపలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో 10 వేల ఎకరాలకు టెండర్ పెట్టే పరిస్థితికి వచ్చాడు..

ఇంకా శ్రీరంగనీతులు మాట్లాడుతున్నాడు... నోట్లో వేలు పెడితే కూడా కొరకలేడంట... అంత మంచోడంట! అంత మంచోడు మనకు అవసరమా? 

కడపలో ముగ్గురు మారీచులు ఉన్నారు. ఒకాయన ఎమ్మెల్యే, ఒకాయన మేయర్ సురేశ్, మరొకాయన రవీంద్రనాథ్ రెడ్డి. వీరు ముగ్గురు కడపను నాశనం చేస్తున్నారు. ఇక్కడొక మంత్రి ఉన్నా ముస్లింలను చంపేస్తున్నా పట్టించుకోడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Kadapa
Road Show
Praja Galam
TDP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News