గ్రీస్ లో నారింజ రంగులోకి ఆకాశం! కారణం ఇదే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గ్రీస్ లో నారింజ రంగులోకి ఆకాశం! కారణం ఇదే..!

Skies Over Greece Turn Orange From Sahara Dust Storm
  • రాజధాని ఏథెన్స్ సహా ఇతర నగరాల్లోనూ ఇదే దృశ్యం ఆవిష్కృతం
  • అవాక్కయిన టూరిస్టులు, స్థానికులు
  • సోషల్ మీడియాలో పోస్టులు.. ఏమిటీ వింత అని నోరెళ్లబెట్టిన నెటిజన్లు
“పైనేదో మర్దర్ జరిగినట్లు లేడూ ఆకాశంలో.. ” అంటూ ముత్యాలముగ్గు సినిమాలో విలన్ గా నటించిన రావుగోపాల్ రావు చెప్పే డైలాగ్ గుర్తుందా? ఎర్రగా కనిపించే ఆకాశం గురించి ఆయన చెప్పిన డైలాగ్ అప్పట్లో తెగ ఫేమస్ అయ్యింది. యూరోపియన్ దేశమైన గ్రీస్ లోనూ కాస్త అటుఇటుగా అదే తరహా దృశ్యం ఆవిష్కృతమైంది! ఆకాశం ఒక్కసారిగా నారింజ రంగులోకి మారిపోవడం స్థానికులతోపాటు పర్యాటకులను అవాక్కు చేసింది.

రాజధాని ఏథెన్స్ సహా ఇతర నగరాలవ్యాప్తంగా ఇదే సీన్ కనిపించింది. దీంతో టూరిస్టులు ఈ వెరైటీ దృశ్యాన్ని తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “అసలు ఏం జరుగుతోంది? ఆకాశం పూర్తిగా నారింజ రంగులోకి మారిపోవడం నేనెప్పుడూ చూడలేదు. సూర్యుడు కనిపించాలి కదా?” అంటూ ‘ఎక్స్’లో ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది ‘యుగాంత’ సన్నివేశమా? ఉంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే..
ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వీచిన బలమైన గాలులు ఇసుక రేణువులతో కూడిన దుమ్మును ఇలా గ్రీస్ మొత్తాన్ని ఇసుక తుపాను రూపంలో కమ్మేశాయి. దీనివల్ల ఆకాశమంతా నారింజ రంగులోకి మారిపోయింది. అయితే ఈ పరిణామం అక్కడి గాలి నాణ్యతను దెబ్బతీసింది. పసుపు–నారింజ రంగులోని సన్నని దుమ్ము వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో పట్టపగలే ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల శ్వాసకోస సమస్యలు కూడా వస్తాయని అధికారులు హెచ్చరించారు. 

పెరిగిన ఉష్ణోగ్రతలు
ఇసుక తుపాను ఉష్ణోగ్రతల పెరుగుదలకు కూడా కారణమైంది. 2018 తర్వాత ఇంత దారుణంగా పరిస్థితి మారడం ఇదే తొలిసారని అధికారులు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద దీవి అయిన, దక్షిణ ప్రాంతంలో ఉన్న క్రీట్ లో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు చేరుకుంది. ఉత్తర గ్రీస్ తో పోలిస్తే ఇది సాధారణంకన్నా ఏకంగా 20 డిగ్రీలకు పైగా ఎక్కువ. ఈ తీవ్ర గాలులకు దేశంలోని దక్షిణ ప్రాంతంలో కార్చిచ్చులు వ్యాపించాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 25 కార్చిచ్చులు ఏర్పడ్డట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ వారాంతానికి తూర్పు మధ్యదరా ప్రాంతంలో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. స్వచ్ఛమైన, తాజా గాలి వీస్తుందని.. ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించారు.
Advertisement
greece
skies
orange
sahara dust storm

More Telugu News