దుబ్బాకకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల
- సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారికి పోస్టులో పంపిస్తానని వెల్లడి
- డబుల్ బెడ్రూం ఇళ్లు, రోడ్లు, ఉపాధి నిధులకు సంబంధించిన వివరాలను పుస్తకంలో పొందుపరిచామన్న బీజేపీ నేత
- దుబ్బాకతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని పంచాయతీల వివరాలూ పంపిస్తామన్న రఘునందన్ రావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డబుల్ బెడ్రూం ఇళ్లు, రోడ్లు, ఉపాధి నిధులకు సంబంధించిన వివరాలను పుస్తకంలో పరిచినట్లు తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు రూ.4.23 లక్షల చొప్పున అందించినట్లు పేర్కొన్నారు. రైతు వేదికలకు రూ.10 లక్షల చొప్పున నిధులు అందించామన్నారు. వైకుంఠదామాలకు రూ.11.13 లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు. దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. డంప్ యార్డులకు రూ.2.5 లక్షల చొప్పున అందించినట్లు తెలిపారు. దుబ్బాకతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ వివరాలను కూడా పంపిస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఏమార్చి ఓట్లు దుండుకొని... ఇప్పుడు పాంచ్ న్యాయ్ అంటూ మరో అబద్ధానికి తెరలేపిందని విమర్శించారు. ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో రాష్ట్రానికి బీఆర్ఎస్ చాలా అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీకి అవకాశమిస్తే, మోదీ మరోసారి ప్రధాని అవుతారన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదిపడితే అది మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా మాట్లాడతామంటే ప్రజలు అంగీకరించరన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. ఇటీవల ఆదిలాబాద్లో మోదీని పెద్దన్న అన్నది రేవంత్ రెడ్డేనని గుర్తు చేశారు.