వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం: చంద్రబాబు హామీ
- వాలంటీర్లను తొలగించబోమన్న చంద్రబాబు
- వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ
- జగన్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మండిపాటు
నిన్న, మొన్న వాలంటీర్లను రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెచ్చారని... ఇప్పుడు వాలంటరీ వ్యవస్థే లేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు. అంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారా, రహస్య జీవో ఏదైనా ఇచ్చారా అని సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. మళ్లీ సీఎం అయితే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే పెడతానని జగన్ అన్నారని... అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా అని అడిగారు. అవకాశవాద రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
వాలంటీర్లను రాజీనామా చేసి, వైసీపీ కోసం పని చేయమంటున్నారని... రాజీనామా చేయనివారిని రాజీనామా చేయకుండానే పార్టీ కోసం పని చేయాలని కూడా చెపుతున్నారని మండిపడ్డారు. తప్పుడు పనులు చేస్తే కేసులు నమోదవుతాయని... కేసులు నమోదైతే వాలంటీర్లకు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావని చెప్పారు. జగన్ మోసాలను వాలంటీర్లు గుర్తించాలని సూచించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్ మెంట్ చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు.