అధ్వానం.. ఎయిర్ ఇండియా సేవలపై ప్రయాణికుడు ఫైర్.. వీడియో ఇదిగో!
- విండో సీట్ కావాలంటే రూ. వెయ్యి అదనంగా ఛార్జ్ చేశారని ఆరోపణ
- తీరా ఫ్లైట్ ఎక్కాక విరిగిన కుర్చీ ఇచ్చారని మండిపాటు
- ఎక్స్ ట్రా చెల్లించి మరీ విరిగిన సీటు తీసుకోవాల్సి వచ్చిందంటూ ట్వీట్
విండో సీటు కోసం తన దగ్గర రూ. వెయ్యి అదనంగా వసూలు చేశారని సదరు ట్విట్టర్ యూజర్ చెప్పాడు. సరే, డబ్బులు ఖర్చయినా సౌకర్యంగా ప్రయాణించవచ్చు కదా అనే ఉద్దేశంతో విండో సీటు కొనుక్కున్నానని వివరించాడు. అయితే, విమానం ఎక్కాక తన సీటు కాస్తా విరిగిపోయి కనిపించిందని చెప్పాడు. వెంటనే ఫ్లైట్ సిబ్బందికి చెప్పగా.. వారు ఇంజనీర్ ను పిలిపించారని, అయినా సీటును బాగు చేయలేకపోయారని అన్నాడు. దీంతో తాను ఢిల్లీ నుంచి బెంగళూరు వరకూ ఆ విరిగిన సీట్లోనే అవస్థపడుతూ ప్రయాణించానని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఎయిర్ ఇండియా స్పందించింది. టికెట్ వివరాలు అడిగి తెలుసుకుని విచారిస్తామని జవాబిచ్చింది. కాగా, ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.