RCB vs KKR: కోహ్లీ ఇన్నింగ్స్ వృథా.. ఆర్సీబీపై కోల్‌కతా గ్రాండ్ విక్టరీ

  • బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచిన నైట్ రైడర్స్
  • సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో 16.5 ఓవర్లలోనే 183 పరుగుల టార్గెట్ ఫినిష్
  • 83 పరుగులతో కోహ్లీ రాణించినప్పటికీ బెంగళూరుకు తప్పని పరాజయం
  • ఎం చిన్నస్వామి స్టేడియంలో కొనసాగుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం
Narine and Venkatesh Iyer help KKR to 7 wicket win over RCB

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత మైదానం ఎం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ మరో విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ 83 పరుగులు చేసినప్పటికీ ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. 183 పరుగుల లక్ష్య ఛేదనలో సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ చెలరేగడంతో కేవలం 16.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసింది. కోల్‌కతా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. కోల్‌కతా బ్యాటర్లలో సునీల్‌ నరైన్‌ 22 బంతుల్లోనే 47 పరుగులు బాదాడు. ఇక వెంకటేశ్ అయ్యర్‌ 30 బంతుల్లోనే 60 పరుగులు నమోదు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 39(నాటౌట్)తో ఫర్వలేదనిపించాడు. బెంగళూరు బౌలర్లలో యశ్ దయాల్, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైశ్యక్ తలో వికెట్ తీశారు.    

అంతకుముందు ఆర్సీబీ బ్యాటింగ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. చివరి దాకా క్రీజులో ఉండి 83 పరుగులు బదాడు. అయితే కోహ్లీ మినహా ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కామెరూన్ (33), మ్యాక్స్‌వెల్ (28), దినేశ్ కార్తీక్(20) పరుగులు మాత్రమే చేశారు. కోల్‌కతా బౌలర్లు ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. క్రీజులో కోహ్లీ ఉన్నప్పటికీ స్కోరు బోర్డుని 182/6 పరుగులకు పరిమితం చేయడంలో విజయవంతమయ్యారు. రస్సెల్ 2-29, రాణా 2-39 కీలకమైన వికెట్లు తీశారు. సునీల్ నరైన్ ఒక వికెట్ పడగొట్టగా మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన సునీల్ నరైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

కాగా ఆర్సీబీ సొంత మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఆరవ విజయం కావడం గమనార్హం. తాజా విజయంతో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో నైట్‌రైడర్స్ రెండవ స్థానానికి చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది.

More Telugu News