Traffic: వాహనాల రొదతో పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పు

  • ధ్వని కాలుష్యంతో పెరుగుతున్న రిస్క్
  • రాత్రిపూట శబ్దాలతో నిద్రకు దూరం
  • హైబీపీ, పక్షవాతం ముప్పు పెరుగుతోందంటున్న నిపుణులు
Vehicle Noise can harm your heart

నగరాల్లో పెరిగిపోతున్న వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ముప్పులతో పాటు ట్రాఫిక్ పెరగడం వల్ల మరో రిస్క్ కూడా పొంచి ఉందని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గుండె ఆరోగ్యానికి ఎసరు పెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాహనాల రొదతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. బీపీ, రక్తనాళాల వాపు తదితర అనారోగ్యాలు కూడా మిమ్మల్ని పలకరించే ప్రమాదం ఉందన్నారు. 

వాహనాల శబ్దం కారణంగా రాత్రిపూట నిద్రకు దూరం కావడంతో పగటిపూట చికాకును పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కంటినిండా నిద్రలేక పోవడం వల్ల హైబీపీ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుందన్నారు.  ప్రతి 10 డెసిబల్స్‌ మేర పెరిగే ట్రాఫిక్‌ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం రిస్క్ 3.2 శాతం మేర పెరుగుతుందని వివరించారు. ఈ అనారోగ్య ముప్పులను తగ్గించేందుకు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నచోట ‘నాయిస్ బ్యారియర్’ లను ఏర్పాటు చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. రోడ్లు నిర్మించే సమయంలో ప్రత్యేకమైన తారును ఉపయోగిస్తే వాహనాల నుంచి వెలువడే శబ్దాలు గణనీయంగా తగ్గుతాయి. వాహనాల వేగాన్ని నియంత్రించడం, తక్కువ శబ్దాన్ని కలిగించే టైర్ల వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఫలితాలు రాబట్టవచ్చని వివరించారు. కార్ పూలింగ్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, సైకిల్ వాడకాలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

More Telugu News