Dr Suneetha: ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా... సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన డాక్టర్ సునీత

  • నిన్న ప్రొద్దుటూరులో సీఎం జగన్ సభ
  • వివేకాను చంపిందెవరో దేవుడికి తెలుసని వ్యాఖ్యలు
  • కానీ చిన్నాన్నను చంపిన వారిని మీరు పక్కనే ఉంచుకున్నారంటూ సునీత ఫైర్
Dr Suneetha fires on her brother CM Jagan

సీఎం జగన్ నిన్న తన ప్రసంగంలో చెల్లెళ్ల ప్రస్తావన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వివేకా హత్య కేసులో తనపై బురద చల్లేవారికి చెల్లెళ్లు ఉపయోగపడుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి ఘాటుగా స్పందించారు. 

చిన్నాన్న చావు వెనుక ఉన్న కుట్రను ఇంతవరకు నిర్ధారించలేదని అన్నారు. చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? అని ఆక్రోశించారు. చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? అని సునీత సీఎం జగన్ ను ప్రశ్నించారు. తిరిగి నా పైనే కేసులు పెట్టడం న్యాయమా? అని నిలదీశారు. 

"ఇప్పుడు ఎన్నికలు రావడంతో చిన్నాన్న గుర్తుకు వచ్చారా? చిన్నాన్న చనిపోయి ఐదేళ్లవుతోంది... ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడడం సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే నేను బయటికి రావాల్సి వచ్చింది. నేను చెప్పేదంతా నిజం... మీరు కూడా ఇలాగే చెప్పగలరా? 

వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారు. కానీ వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారు. ఎవరు చంపించారో హత్య చేసిన వ్యక్తి  స్పష్టంగా చెబుతున్నారు. నిందితుల వెనుక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు. 

గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు... ఆ తర్వాత మీరే వద్దన్నారు. మీ పేరు బయటికి వస్తుందనే సీబీఐ విచారణ కోరట్లేదా? నిందితుడిని పక్కనబెట్టుకుని, అతడికి ఓటు వేయాలని కోరుతున్నారు. అతడు నిందితుడు అని సీబీఐ చెబుతున్నా, మీరు అతడికి ఓటు వేయాలని కోరుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వ్యక్తికి ఓటు వేయాలని అడగడం మీకు తప్పుగా అనిపించడంలేదా?

ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో సానుభూతి కోసమే చిన్నాన్నను తెరపైకి తీసుకువస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం... మీరు పోరాడేది పదవుల కోసం. ఈ సందర్భంగా, హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరుతున్నా. 

పదవులు ఆశించి రాజకీయాలు చేస్తున్నట్టు నాపై ఆరోపణలు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు చెల్లెలు గుర్తుకు రాలేదా? నాకు న్యాయం కావాలి అని నేను ఎలుగెత్తుతుంటే, మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు. అన్నీ మరిచిపోయి ఓటు అడిగేందుకు మీకు మనసెలా అంగీకరిస్తుంది? హత్య చేసిన వారితో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. హత్య చేసిన, చేయించిన వారితో తిరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి" అంటూ డాక్టర్ సునీత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News