Bandi Sanjay: హామీలు అమలు చేసినట్లు నిరూపించండి.. పోటీ నుంచి తప్పుకుంటా: బండి సంజయ్

  • కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేత బండి సంజయ్ సవాల్
  • సోమవారంలోగా హామీలు అమలు చేసినట్లు నిరూపించాలని డిమాండ్ 
  • అలా నిరూపిస్తే ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ను ఉపసంహరించుకుంటానని వెల్లడి  
  • నిరూపించలేకపోతే పోటీ నుంచి తప్పుకుంటారా? అంటూ సవాల్ 
bandi sanjay challenges congress to prove implementation of six poll guarantees

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామంటూ తమ మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పుకుందని మండిపడ్డారు. శనివారం కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఖాతాలో రూ. 2,500 జమ చేసినట్లు నిరూపించాలి. ఆసరా పెన్షన్లను రూ. 4 వేలకు పెంచినట్లు నిరూపించాలి. విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చామని నిరూపించాలి. గ్యారంటీలను అమలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా. సోమవారంలోగా నిరూపిస్తే నా నామినేషన్ ను ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ నేతలు ఈ హామీలను అమలు చేసినట్లు నిరూపించలేకపోతే పోటీ నుంచి తప్పుకుంటారా’ అని బండి సంజయ్ సవాల్ విసిరారు. హామీలు నిలబెట్టుకోనందుకే బీఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు.

More Telugu News