IPL 2024: ఐపీఎల్ 2024‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఐపీఎల్ తనకు గుర్తింపు ఇచ్చిందన్న ముంబై కెప్టెన్
  • ఐపీఎల్ లేకుంటే బరోడాలోనే ఉండేవాడినని ఎమోషనల్
  • ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేసిన హార్ధిక్ పాండ్యా
IPL Gave Me My Identity says Hardik Pandya before first match of Mumbai Indians

ఐపీఎల్ 2024లో నేడు (ఆదివారం) మరో ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ ఏడాది టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు.

‘‘ 10వ ఐపీఎల్ సీజన్‌ ఆడుతున్న సందర్భంగా నా ఎదుగుదల, నా ప్రయాణంలో దక్కిన ప్రతిదానికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండే జట్టులోకి తిరిగి వచ్చినందుకు ధన్యవాదాలు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ఐపీఎల్ తనకు అన్నీ ఇచ్చిందని, ఐపీఎల్ తనకు గుర్తింపు ఇచ్చిందని అన్నాడు. ఐపీఎల్ లేకుంటే తాను బరోడాలోనే ఉండేవాడినని, హార్దిక్ పాండ్యా ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించాడు. మరో హార్ధిక్ ఎవరో జట్టులో ఉండేవాడని ముంబై కెప్టెన్ అన్నాడు. ఈ మేరకు ఎక్స్‌లో ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు.

కాగా ప్రస్తుతం టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌గా హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 2015లో కేవలం రూ.10 లక్షలతో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ప్రపంచంలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా మారిపోయాడు. బరోడాలో పుట్టిన హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒక సీజన్‌లో గుజరాత్ టైటిల్ విజేతగా నిలవగా.. గతేడాది రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రత్యేక విధానంలో హార్ధిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా పేరుని ప్రకటించింది.

More Telugu News