Pawan Kalyan: ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి... చిటికెన వేలంత రావణుడు...దించడం ఓ లెక్కా!: పవన్ కల్యాణ్

  • బొప్పూడిలో ప్రజాగళం సభ
  • ఆవేశపూరితంగా ప్రసంగించిన పవన్
  • మోదీ రాకతో పరిస్థితి మారిపోతుందని వెల్లడి
  • ఇక ఏపీలో కూటమి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా 
Pawan Kalyan calls CM Jagan a liquor businessman

బొప్పూడి ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని ఆసక్తికరంగా ప్రారంభించారు. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

"పితృదేవతల ముక్తి కోసం వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లోని గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది ధార కోసం ఎలా ఎదురుచూస్తున్నారో... అలా నరేంద్ర మోదీ గారి రాక కోసం అభివృద్ధి లేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్ర  ప్రజానీకం, దాష్టీకం తోటి, దోపిడీ తోటి నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకం, అవినీతి, ప్రజాస్వామిక విధానాలతో నలిగిపోతున్న ఆంధ్ర ప్రజానీకానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం అలా ఎదురు చూస్తున్నారు. 

హిమాలయాల నుంచి గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చి ఎలా సేద దీర్చిందో మన ప్రియతమ ప్రధాని మోదీ రాక, ఈ ఎన్డీయే పునర్ కలయిక 5 కోట్ల మంది ఆంధ్రులకు అలా ఆనందాన్ని ఇచ్చింది. దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతూ, హ్యాట్రిక్ కొట్టబోతున్న నరేంద్ర మోదీ గారికి ఏపీ ప్రజల నుంచి, జనసేన నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 

2014లో తిరుపతి బాలాజీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఈ పొత్తు మొదలైంది. ఇవాళ 2024లో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు మరో రూపం దాల్చుతోంది. అమరావతి దేదీప్యంగా వెలిగిపోవాలని, దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు ఇక్కడికి వచ్చారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేను అండగా ఉన్నానని వచ్చిన మోదీ గారికి ఘనస్వాగతం పలుకుదాం. 2014ను మించిపోయేలా ఈసారి దుర్గమ్మ ఆశీస్సులతో ఘనవిజయం సాధిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం.

మోదీ డిజిటల్ భారత్ అంటూ దేశాన్ని ముందుకు తీసుకెళుతుంటే, ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా డబ్బు చెల్లింపులతో అవినీతికి నిలయంగా మారింది. ఈ ముఖ్యమంత్రి ఒక సారా వ్యాపారి. ఈ ఐదేళ్లలో రూ.1,13,580 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగితే... దాన్ని రూ.84,050 కోట్లుగా మాత్రమే చూపిస్తున్నారు. రూ.10 వేల కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టారు. 

జేపీ వెంచర్స్ పేరు మీద ఇసుక దోపిడీ చేపట్టారు. ఆ ఐదుగురు బినామీలు ఎవరో తెలుసు. దాదాపు రూ.40 వేల కోట్ల మేర ఇసుక కుంభకోణం చేశారు. దీనిపై ప్రశ్నించిన కిషన్ అనే రిపోర్టర్ ను చిత్తూరులో చంపేశారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్ కు డ్రగ్స్ రాజధానిగా మారింది. 2019-21 మధ్య 30,196 మంది మహిళలు అదృశమయ్యారని కేంద్రమంత్రి పార్లమెంటులో స్వయంగా చెప్పారు. వారేమయ్యారో అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా విదేశాల నుంచి సంస్థలు దేశానికి తరలివస్తుంటే, ఏపీ నుంచి సంస్థలు పారిపోతున్నాయి. 

వివేకా గారిని చంపారు... చంద్రబాబును అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇది... నన్ను కూడా పలుమార్లు అడ్డుకున్నారు... జగన్ కు డబ్బులు ఎక్కువైపోయాయి... ఎవరి అడ్డుఆపు లేదు. రావణాసురుడు కూడా అలాగే అనుకున్నాడు... నన్నెవరు ఏమీ చేయలేరు అనుకున్నాడు... కానీ నారచీర కట్టుకుని శ్రీరాముడు నేలపై నిలబడి బాణంతో చంపేశాడు. 

రావణకాష్ఠం చేసిన రాముడ్ని అయోధ్యకు తీసుకువచ్చిన మోదీ గారు ఉండగా... రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసిన ఈ చిటికెన వేలంత రావణుడ్ని దించేయడం ఏమంత కష్టమా! ఈసారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం... మోదీ గారు పాంచజన్యం మోగిస్తారు... కూటమిదే విజయం, ధర్మానిదే గెలుపు" అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

More Telugu News