Danam Nagender: బీఆర్ఎస్ కు మరో షాక్.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్

  • పార్టీని వీడుతున్న నేతలతో బీఆర్ఎస్ సతమతం
  • బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన దానం, ఎంపీ రంజిత్ రెడ్డి
  • సికింద్రాబాద్ నుంచి దానం పోటీ చేసే అవకాశం
Danam Nagender joins Congress

తెలంగాణలో అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు పార్టీ మారారు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

మరోవైపు, చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ టికెట్ ఆఫర్ చేసినట్టు సమాచారం. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, మారిన పరిణామాల నేపథ్యంలో... ఆమెకు మల్కాజ్ గిరి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. 

దానం నాగేందర్ విషయానికి వస్తే... గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పని చేశారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. నిన్నటి వరకు కూడా ఆయన బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని చెప్పారు. ఈరోజు కారు దిగేసి... కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

More Telugu News