Aruri Ramesh BJP: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ నేత ఆరూరి రమేశ్.. వీడియో ఇదిగో!

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి
  • వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తగా పనిచేస్తానని వెల్లడించిన రమేశ్
  • అనుచరులతో కలిసి జై భారత్, జై మోదీ అంటూ నినాదాలు
BRS Leader Aruri Ramesh Joined Into BJP

బీఆర్ఎస్ సీనియర్ నేత, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆదివారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. పదేళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలతో కలిసిపోయి పార్టీ కోసం పనిచేస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మరికొంతమంది హాజరు కావాల్సి ఉండగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారని వివరించారు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ తదితర నేతలను తాను ప్రత్యేకంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. తన అనుచరులతో కలిసి జై భారత్, జై మోదీ అంటూ ఈ సందర్భంగా ఆరూరి రమేశ్ నినాదాలు చేశారు.

ఆరూరి రమేశ్ పార్టీ మారడం సందర్భంగా ఇటీవల పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి రెండు మూడు రోజుల కిందటే ఆరూరి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఈమేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేతలు వచ్చి బలవంతంగా ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఈ సందర్భంగా జనగాం వద్ద బీజేపీ నేతలు కారును అడ్డుకున్నారు. ఆరూరి రమేశ్ ను బీఆర్ఎస్ నేతల నుంచి విడిపించే ప్రయత్నంలో ఆయన చొక్కా చిరిగింది. దీంతో కన్నీళ్లతో నమస్కరిస్తూ తనను వెళ్లనివ్వాలని ఆరూరి ప్రాధేయపడ్డారు.

అనంతరం హైదరాబాద్ లో మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. బీజేపీలో చేరతాననే ప్రచారం అంతా వట్టిదేనని వివరించారు. కేసీఆర్ తో భేటీ అయిన మరుసటి రోజే ఆరూరి రహస్యంగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. శనివారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆరూరి.. ఆదివారం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

More Telugu News