Donald Trump: నేను గెలవకపోతే రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్

  • నవంబర్ 5వ తేదీ అమెరికా చరిత్రలో ముఖ్యమైనదిగా మారుతుందన్న మాజీ అధ్యక్షుడు
  • తన ప్రత్యర్థి జో బైడెన్ ‘చెత్త’ అని విమర్శించిన రిపబ్లికన్ నేత
  • మెక్సికోలో కార్లు తయారు చేసి అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ఆటలను సాగనివ్వనన్న ట్రంప్
Bloodbath If iam not Elected says Donald Trump

రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. శనివారం ఓహియో రాష్ట్రంలోని వాండాలియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తేదీ అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందని అన్నారు. అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్’లో అడుగుపెట్టేందుకు తాను సాగిస్తున్న ప్రచారం దేశానికి కీలకమైన మలుపుగా మారబోతోందని అన్నారు. ‘‘నవంబర్ 5వ తేదీని గుర్తుంచుకోండి. మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన తేదీ అని నేను భావిస్తున్నాను" అని అన్నారు. తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్‌ను చెత్తగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతమేనని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఏ ఉద్దేశంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టత ఇవ్వలేదు. 

మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను చెక్ పెడతానని, అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా కార్లను ఇక్కడ విక్రయించబోనివ్వనని అన్నారు. ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతం అవుతుందని, అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనని అన్నారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. కీలక రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో నామినీగా ఆయనకు మార్గం సుగమమైంది.

More Telugu News