Magunta Sreenivasulu Reddy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

  • టీడీపీలోకి ఊపందుకున్న చేరికలు
  • తనయుడు సహా పసుపు కండువా కప్పుకున్న శ్రీనివాసులురెడ్డి
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యేలు  వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చెంచు గరటయ్య
Ongole MP Magunta Srinivasulu Reddy and his son joins TDP

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవ నేడు చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తండ్రీకొడుకులు ఇరువురికీ టీడీపీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సమయంలో అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు బాచిన కృష్ణచైతన్య, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో  టీడీపీలో చేరారు. వారందరికీ చంద్రబాబు మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, నేడు ఒక శుభదినం అని, ఎన్నికల కోడ్ వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఇక ఎవరూ భయపడే పరిస్థితి లేదని అన్నారు. రేపు ఆదివారం నాడు ప్రజాగళం పేరుతో చిలకలూరిపేట బహిరంగ సభతో చరిత్ర సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. "రాష్ట్రంలో నిన్నటిదాకా ప్రతి ఒక్కరూ భయపడ్డారు. కానీ నాలాంటి వాడు తెగించాడు... నేను కూడా భయపడితే రాష్ట్రంలో మనుగడ సాధించలేరు" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాకతో జిల్లాలో రాజకీయం తిరగబడిందని అన్నారు. ఒంగోలు ఎంపీ స్థానంలో గెలుపు టీడీపీదే కాబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. దర్శి నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థిని త్వరలోనే నియమిస్తాం అని చంద్రబాబు వెల్లడించారు.

More Telugu News