CAA: సీఏఏ అమలుపై అమెరికా ఆందోళనపై తీవ్రంగా స్పందించిన భారత్

  • భారత్ లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు
  • వ్యతిరేకిస్తున్న అమెరికా
  • సీఏఏ భారత్ అంతర్గత విషయమన్న కేంద్రం 
India counters US objections on CAA

పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వలస వచ్చిన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఇటీవల భారత్ లో అమల్లోకి వచ్చింది. అయితే, భారత కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకిస్తోంది. 

సీఏఏ అమలు తమకు ఆందోళన కలిగిస్తోందని, మత స్వేచ్ఛను కల్పించడం, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య మూల సూత్రాలు అని అమెరికా పేర్కొంది. ఈ సూత్రాల ఉల్లంఘన ఎక్కడ జరిగినా తాము వ్యతిరేకిస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 

అయితే, అమెరికా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. సీఏఏ అమలు భారత్ అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసింది. సీఏఏ... భారత సార్వభౌమత్వానికి, సమగ్రతకు, సంప్రదాయాలకు సంబంధించిన విషయం అని, దీర్ఘకాల నిబద్ధతకు అనుగుణంగా ఈ చట్టాన్ని రూపొందించామని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఉద్ఘాటించారు. 

ఓ వ్యక్తికి ఏ దేశ జాతీయత లేనప్పుడు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం కల్పిస్తామని, ఇది మానవ హక్కులకు మద్దతు ఇచ్చే చట్టం అని పేర్కొన్నారు. సీఏఏ వల్ల ఏ పౌరుడి హక్కులకూ భంగం కలగదని, ఎవరి హక్కులు తొలగించబోవడంలేదని వివరించారు. 

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు గురై భారత్ కు వలస వచ్చిన మైనారిటీ ప్రజలకు ఈ చట్టం వర్తిస్తుందని తెలిపారు. ఆయా దేశాల నుంచి 2014 వరకు భారత్ కు వలస వచ్చిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వం కల్పించడమే సీఏఏ ముఖ్య ఉద్దేశం అని జైస్వాల్ వెల్లడించారు.

More Telugu News