aruri ramesh: హైడ్రామా మధ్య కేసీఆర్ నివాసం వద్ద ప్రత్యక్షమైన ఆరూరి రమేశ్... తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టీకరణ... ఇదిగో వీడియో

  • ఆరూరి రమేశ్ బీజేపీలో చేరుతారని ప్రచారం
  • ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తారని గుప్పుమన్న వార్తలు
  • ప్రెస్ మీట్ నుంచి ఆయనను తీసుకెళ్లిన బీఆర్ఎస్ నాయకులు
  • హైదరాబాద్‌లో కేసీఆర్ నివాసం వద్ద ప్రత్యక్షమైన ఆరూరి రమేశ్
  • తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానంటూ స్పష్టీకరణ
Hydrama in Aruri Ramesh issue

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వ్యవహారంలో హైడ్రామా నడిచింది. హన్మకొండలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశాన్ని పలువురు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని... ఆయనను తీసుకెళ్లి... బుజ్జగించినట్లుగా వార్తలు వచ్చాయి. పార్టీకి రాజీనామా చేయవద్దని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు సహా పలువురు కోరినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా ఆరూరి రమేశ్ విషయంలో హైడ్రామా కొనసాగింది. చివరకు బుధవారం హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు.

పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆయనను వరంగల్ నుంచి కేసీఆర్ నివాసానికి తీసుకు వచ్చారు. చర్చల కోసం కేసీఆర్ ఆయనను పిలిపించినట్లుగా చెబుతున్నారు. ఆరూరి రమేశ్ పార్టీ మారకుండా స్వయంగా కేసీఆర్ బుజ్జగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: ఆరూరి రమేశ్

రమేశ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రోజు కేసీఆర్ నివాసం వద్ద ప్రత్యక్షమైన ఆరూరి రమేశ్ మాట్లాడుతూ... పార్టీకి చెందిన నేతలతో కలిసి తాను హైదరాబాద్ వచ్చానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వెల్లడించారు. తాను నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశానని చెబుతున్నారని... కానీ అందులో వాస్తవం లేదన్నారు.

బీజేపీ నేత సీతారామ్ నాయక్ ఏమన్నారంటే...

ఆరూరి రమేశ్ నిన్న అమిత్ షాను కలిశారని... బీజేపీలో చేరేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారని తెలిపారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటన చేస్తానని చెప్పారని... ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు వచ్చి ఆయనను అడ్డుకున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు... రమేశ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేశ్ తన ఇష్టపూర్తిగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తనకు బీఆర్ఎస్ చేసిన అన్యాయంపై  151 పుస్తకాలు రాయవచ్చునన్నారు. గతంలో దళితులకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇదివరకు ఎప్పుడైనా ఆరూరికి ఎర్రబెల్లి దయాకరరావు మద్దతుగా నిలిచారా? అని ప్రశ్నించారు.

More Telugu News