2024 Hyundai Creta N Line: భారత మార్కెట్‌లో ‘2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్’ కారు ఆవిష్కరణ

  • బాహ్య  ప్రధాన మార్పులతో మార్కెట్‌లో విడుదల
  • కారు ప్రారంభ ధర రూ. 16.82 లక్షలు.. గరిష్ఠ ధర రూ. 20.30 లక్షలు
  • రూ.25000 టోకెన్ ధరతో బుకింగ్ అవకాశం ఉందని తెలిపిన హ్యుందాయ్ కంపెనీ
2024 Hyundai Creta N Line launched in Indian Market

బాహ్య ప్రధాన మార్పులతో భారత మార్కెట్‌లో ‘2024 క్రెటా ఎన్ లైన్‌’ కారును హ్యుందాయ్ కంపెనీ ఆవిష్కరించింది. లోపల చిన్నచిన్న మార్పులతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎస్‌యూవీ కారు ‘ఎన్ మోడల్ సిరీస్‌’లో మూడవదని కంపెనీ వెల్లడించింది. కారు ప్రారంభ ధర రూ. 16.82 లక్షలు కాగా గరిష్ఠ ధర రూ. 20.30 లక్షల వరకు ఉంటుందని తెలిపింది. రూ.25,000 టోకెన్ ధరతో కారు అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులో ఉందని పేర్కొంది. ‘2024 క్రెటా ఎన్ లైన్’ కారు మూడు బాహ్య రంగుల్లో లభ్యమవుతుందని ప్రకటనలో పేర్కొంది. సాలిడ్ కలర్‌లలో అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే మ్యాట్ ఉన్నాయి. కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్‌లో అట్లాస్ వైట్, షాడో గ్రే, థండర్ బ్లూ రంగులు ఆప్షన్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించిన 2 నెలల లోపే మార్కెట్‌లోకి వచ్చిన ఈ కారు ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి.

2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ప్రత్యేకతలు ఇవే
2024 హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కారు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో తయారు చేశారు. ఈ ఇంజన్ 160హెచ్‌పీ గరిష్ఠ శక్తి, 253ఎన్ఎం గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుందని వివరించింది. ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌తో అనుసంధానించినట్టు వెల్లడించింది. భద్రత విషయానికి వస్తే.. వెనుక డిస్క్ బ్రేక్‌లు, 360-డిగ్రీ కెమెరాలు, బ్లైండ్-స్పాట్ మోనిటర్లు, టైర్ ప్రెజర్ మానిటర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్ 2 అడాస్ టెక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు మరిన్ని సౌకర్యాలు ఉన్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ డాష్ క్యామ్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.

More Telugu News