మీ అందరికీ బాలయ్య.. నా ఒక్కడికే ముద్దుల మామయ్య: నారా లోకేశ్
- అనంతపురంలో నారా లోకేశ్ శంఖారావం సభ
- ఐదేళ్లలో జగన్ చేసిందేమీ లేదని విమర్శ
- అనంతపురం జిల్లాలో పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమికొట్టాలని పిలుపు
వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలను జగన్ నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగ యవతను మోసం చేశారని చెప్పారు. వంద సంక్షేమ పథకాలను రద్దు చేశారని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారో జగన్ ను ప్రజలు నిలదీయాలని అన్నారు. జగన్ సిద్ధం సభలకు జనాలు రావడం లేదని... దీంతో, గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ తో జనాలు వచ్చినట్టు చూపిస్తున్నారని సెటైర్ వేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాకు కోర్డినేటర్ గా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి గురించి మాట్లాడుతూ... జిల్లాలో పాపాల పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమికొట్టాలని అన్నారు. చిత్తూరు జిల్లాను పాపాల పెద్దిరెడ్డి పూర్తిగా దోచేశారని... ఇప్పుడు అనంతపురం జిల్లాను కూడా దోచేందుకు రెడీ అవుతున్నారని చెప్పారు.
అనంతపురం జిల్లాతో తనది ప్రత్యేకమైన అనుబంధమని లోకేశ్ అన్నారు. తన తాత ఎన్టీఆర్ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచారని, మామయ్య హరికృష్ణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారని, బాలకృష్ణ మామయ్య వరుసగా రెండు సార్లు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారని చెప్పారు. ఆయన మీ అందరికీ బాలయ్య అయితే... తనకు మాత్రమే ముద్దుల మామయ్య అని అన్నారు.