‘మిస్ వరల్డ్ 2024’ విజేత క్రిస్టీనా పిస్కోవాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇవే!
- చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్న చెక్ రిపబ్లిక్ భామ
- గతంలో మిస్ యూరప్ అవార్డును దక్కించుకున్న క్రిస్టీనా
- చిన్న వయసు నుంచే సేవాభావ దృక్పథాన్ని చాటుకుంటున్న వైనం
- వెనుకబడిన వర్గాల పిల్లల కోసం టాంజానియాలో స్కూల్‌ని ఏర్పాటు చేసిన క్రిస్టీనా పిస్కోవా
సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రిస్టీనా పిస్కోవా చాలా చురకుగా ఉంటారు. తన సేవా కార్యక్రమాల కోసం ‘క్రిస్టీనా పిస్కో ఫౌండేషన్’ను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టాంజానియాలో ఓ స్కూల్‌ని ఏర్పాటు చేశారు. ఈ స్కూలు పిల్లలు, వృద్ధులు, మానసిక వికలాంగులకు కూడా సేవలు అందిస్తోంది. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలనే నిబద్ధతతో ఆమె పనిచేస్తుంటారు. చదువు విషయానికి వస్తే క్రిస్టీనా పిస్కోవా.. డ్యుయెల్ డిగ్రీలో లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే మోడలింగ్‌పై ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేసి నిబద్ధతతో ముందుకెళ్లారు. 2022లో లండన్‌లోని ‘ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నారు. అదే ఏడాది నిర్వహించిన ‘మిస్ చెక్ రిపబ్లిక్’ పోటీల్లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు.