Komatireddy Venkat Reddy: రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు: మంత్రి కోమటిరెడ్డి

  • కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు... నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్య
  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లే అవకాశముందన్న కోమటిరెడ్డి
  • లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం
  • కేసీఆర్‌కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా 
Komatireddy says kcr is not ready to face revanth reddy

కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనకు నక్కకు... నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత హరీశ్ రావు ఆ పార్టీలో ఉండటం అనుమానంగానే ఉందని... బీజేపీలోకి వెళ్లే అవకాశముందని జోస్యం చెప్పారు. బీజేపీతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.

పదేళ్ల కాలంలో తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశాడని ఆరోపించారు. కోట్లాది రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు. గతంలో బీఆర్ఎస్ తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లుగా మేం కూడా ఇప్పుడు చేర్చుకుంటే ఆ పార్టీలో మిగిలేది నలుగురు మాత్రమేనని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతోందని... లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని జోస్యం చెప్పారు. 14 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందడం ఖాయమన్నారు.

కాంగ్రెస్ పాలన చూసి బీఆర్ఎస్ నేతలే అభినందిస్తున్నారని... లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ శ్రేణులు మరింత శ్రమించాలని సూచించారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ కంటే అధిక మెజార్టీ వస్తుందన్నారు. కేసీఆర్‌కు దిక్కులేక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎల్ఆర్ఎస్‌పై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అన్నారు. ఉద్యోగులకు ఒకటవ తేదీనే వేతనాలు అందిస్తున్నట్లు చెప్పారు. గ్రూప్-1, డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు.

More Telugu News