Andhra Man: తల్లిని జుట్టుపట్టి ఈడ్చి.. తండ్రిని కొడుతూ.. ఏపీలో ఓ కొడుకు దాష్టీకం

  • మూడెకరాల భూమి తమ్ముడికి రాసిచ్చారని గొడవ
  • కొట్టొద్దని వేడుకుంటున్నా వినిపించుకోని కసాయి కొడుకు
  • దాడిని అడ్డుకోకుండా చూస్తూ నిలుచున్న జనం
Andhra Man Drags Mother By Hair And Slaps Father Over Land Issue

మూడు ఎకరాల భూమి కోసం కనీపెంచిన తల్లిదండ్రులపైనే దాడి చేశాడో కొడుకు.. తల్లిని జుట్టుపట్టి లాగి కిందపడేసి, తండ్రిని కొట్టాడు. వృద్ధులైన తల్లిదండ్రులు కన్నీళ్లతో వేడుకుంటున్నా కనికరించలేదు. చుట్టుపక్కల జనం చూస్తూ నిలబడ్డారే తప్ప ఒక్కరూ ఆ వృద్ధులకు సాయం రాలేదు. ఆ కసాయి కొడుకును నిలవరించలేదు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుందీ దారుణం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. వారి ఫిర్యాదుతో కసాయి కొడుకును అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని బి కొత్తకోట మండలం గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలు మదనపల్లెలోని అయోధ్యనగర్‌లో ఓ కల్యాణ మండపంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు మనోహర్‌ రెడ్డి ఊరిలో వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డి మదనపల్లెలో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కుటుంబ ఆస్తి మూడెకరాలను తమ్ముడికి రాసిచ్చారని మనోహర్ రెడ్డి తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 2న తల్లిదండ్రులతో గొడవపడి దాడి చేశాడు. తల్లి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళుతూ పిడిగుద్దులు కురిపించాడు.

అడ్డుకున్న తండ్రి గుండెలపై తన్ని, చెంపలపై కొట్టాడు. వీధిలో అందరూ చూస్తూ నిలబడ్డారే తప్ప ఎవరూ అడ్డుకోలేదు. గుర్తుతెలియని వ్యక్తులు రికార్డు చేసిన ఈ సంఘటన వీడియో వైరల్‌ కావడంతో పోలీసులు స్పందించారు. వృద్ధుల ఫిర్యాదు మేరకు శ్రీనివాసులు రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసులురెడ్డిపై ఐపీసీ సెక్షన్‌ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. తల్లిదండ్రులను సరిగా చూసుకోకున్నా, ఆస్తి కోసం వేధించినా, దాడి చేసినా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News