ఈ నెల 6న కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ
- ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటన
- ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరంపై సిఫార్సులను కోరామని వెల్లడి
- 4 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం గడువు విధింపు
- బ్యారేజ్‌లలో నీటిని నింపాలన్న బీఆర్ఎస్ డిమాండ్ బాధ్యతారాహిత్యమని వ్యాఖ్య
‘‘నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఖాళీ చేశాం. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ తిరిగి నీటిని నింపాలని డిమాండ్ చేయడం బాధ్యతా రాహిత్యమే. మేడిగడ్డ పియర్లు కుంగిన తరువాత అప్రమత్తమైన మా ప్రభుత్వం ఆ బ్యారేజీతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలపై విచారణ నిర్వహించాలని ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. డిజైన్లు, నిర్మాణాలను అన్ని కోణాల్లో పరిశీలించామని, పగుళ్లు, కుంగుబాటుకు కారణాలు విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిఫార్సులు చేయాలని కోరింది. నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీకి ప్రభుత్వం ఇటీవల గడువు విధించింది. అయినప్పటికీ వీలైనంత త్వరగా కమిటీని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డిజైన్ల నిర్మాణం, నాణ్యత, నిర్వహణ.. అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కింది’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు.