Bill Gates: ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సమావేశం

  • ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బిల్ గేట్స్
  • గురువారం మోదీతో సమావేశం, ఏఐ సహా పలు అంశాలపై చర్చ
  • మోదీతో సమావేశం స్ఫూర్తిమంతమని ట్విట్టర్ వేదికగా గేట్స్ వ్యాఖ్య
  • సమావేశం అద్భుతంగా సాగిందన్న ప్రధాని మోదీ
Always inspiring lot to discuss Bill Gates on meeting PM Modi

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మోదీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు. అనేక అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళల నాయకత్వంలో అభివృద్ధి, వ్యవసాయరంగంలో సృజనాత్మక మార్పులు, ప్రజారోగ్యం, వాతావరణ మార్పులు, భారత్ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన అంశాలతో పాటు పలు ఇతర విషయాలు ఇరువురి మధ్య చర్చకు వచ్చాయి. 

కాగా, సమావేశం అనంతరం మోదీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. గేట్స్‌‌తో మీటింగ్ అద్భుతంగా సాగిందని వ్యాఖ్యానించారు. పుడమి పరిరక్షణ, సామాన్యులకు సాధికారత వంటి అనేక అంశాలపై చర్చించామని తెలిపారు. అంతకుమునుపు, గేట్స్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌తో కూడా సమావేశమయ్యారు.  

మంగళవారం రాత్రి బిల్ గేట్స్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం తొలుత ఆయన ఒడిసా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఆ తరువాత రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులతో కలిసి రాజధాని భువనేశ్వర్‌లోని స్లమ్ ఏరియాలను సందర్శించి అక్కడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కొన్ని మహిళా స్వయం సహాయక బృందాలతో కూడా గేట్స్ సమావేశమయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి కూడా గేట్స్ హాజరు కానున్నారని తెలుస్తోంది.

More Telugu News