MLA Lasya Nanditha: ‘ఏం జరిగిందో.. ఎలా జరిగిందో గుర్తులేదు’.. లాస్య నందిత కారు డ్రైవర్ స్టేట్ మెంట్

  • ఆసుపత్రిలో డ్రైవర్ ను ప్రశ్నించిన పోలీసులు
  • ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒకే జవాబిస్తున్న డ్రైవర్
  • డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా
MLA Lasya Nanditha Car Driver Statement Over Accident

కారు ప్రమాదంలో గురువారం ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. వేగంగా వెళుతున్న కారు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ ను ఢీ కొట్టడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ప్రమాదంలో గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన డ్రైవర్ ను ప్రశ్నించారు. ప్రమాదం ఎలా జరిగిందని ఎన్నిమార్లు, ఎలా ప్రశ్నించినా.. ‘ఏం జరిగిందో.. ఎలా జరిగిందో గుర్తులేదు’ అని డ్రైవర్ చెబుతున్నాడని, అదొక్క మాట తప్ప మరే వివరాలూ చెప్పడంలేదని పోలీసులు వివరించారు.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డ్రైవర్ ను శుక్రవారం సాయంత్రం విచారించిన పోలీసులు.. ఆయన స్టేట్ మెంట్ రికార్డు చేశారు. శనివారం ఉదయం మరోమారు విచారించనున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తీరు, డ్రైవర్ సమాధానాలతో ఈ ఘోరానికి కారణం డ్రైవర్ నిద్రమత్తు కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వేగంగా వెళుతున్న క్రమంలో ముందున్న లారీని తప్పించబోయి రెయిలింగ్ ను ఢీ కొట్టి ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది.

కారు బ్యానెట్ పైభాగం పూర్తిగా ధ్వంసం కాగా, ఎడమవైపు చక్రం కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో గంటకు 100 కి.మీ. వేగంతో కారు దూసుకెళుతోందని, రెయిలింగ్ ను ఢీ కొట్టాక స్పీడో మీటర్ స్ట్రక్ అయిందని పోలీసులు చెప్పారు. కాగా, ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీ కొడితే ఈ స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై మరింత లోతుగా విచారించాలని కోరుతున్నారు.

More Telugu News