కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు ‘నో’ చెప్పిన ఎలాన్ మస్క్ సారధ్యంలోని ‘ఎక్స్’
- నిర్దేశిత ఎక్స్ అకౌంట్లు, పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్న ఎక్స్ టీమ్
- భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలు తీసుకోబోమని వెల్లడి
- కేంద్రం ఆదేశాలపై రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా పేర్కొన్న ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం
‘‘ సూచించిన ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ‘ఎక్స్’కు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసింది. జరిమానాలతో పాటు జైలు శిక్ష అవకాశాలను పరిశీలించాలని కోరింది. ఆదేశాలకు కట్టుబడి భారత్‌లో మాత్రమే ఈ అకౌంట్లు, పోస్టులను నిలిపివేస్తున్నాం. అయితే చర్యలు తీసుకునే విషయంలో మేము ఏకీభవించడం లేదు. భావప్రకటనా స్వేచ్ఛను ఈ పోస్టులకు కూడా వర్తింపజేయాలనుకుంటున్నాం’’ అని ఎక్స్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం పోస్ట్ పెట్టింది.
కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ ‘ఎక్స్’ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభావిత యూజర్లను గుర్తించామని, పారదర్శకత కోసం ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేశామని ఎక్స్ తెలిపింది. అయితే నిబంధనలకు విరుద్ధమైన డేటాను బహిర్గతం చేయలేదని, అలా చేయబోమని స్పష్టత ఇచ్చింది.