Alexei Navalny: రష్యా విపక్ష నేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతి

  • వివిధ కేసుల్లో నావల్నీకి 19 ఏళ్ల జైలు శిక్ష
  • ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీ జైల్లో ఉన్న నావల్నీ
  • వాకింగ్ కు వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన వైనం
  • బతికించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్న రష్యా జైళ్ల శాఖ 
Russia opposition leader Alexei Navalny died in prison

రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతి చెందారు. 47 ఏళ్ల అలెక్సీ నావల్నీ మృతి చెందినట్టు  రష్యా జైళ్ల శాఖ నేడు ప్రకటించింది. 19 ఏళ్ల జైలు శిక్షకు గురైన నావల్నీ ఖార్ప్ లోని ఆర్కిటిక్ ప్రిజన్ కాలనీ జైల్లో ఉన్నారు. వాకింగ్ కు వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 

వైద్య బృందం తీవ్రంగా శ్రమించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని రష్యా జైళ్ల శాఖ వెల్లడించింది. నావల్నీ మరణానికి దారితీసిన కారణాలను గుర్తిస్తున్నామని తెలిపింది. రష్యా దర్యాప్తు ఏజెన్సీ నావల్నీ మృతిపై విచారణ ప్రారంభించింది. 

అటు, నావల్నీ మీడియా కార్యదర్శి కిరా యర్మిష్ స్పందిస్తూ... ఈ ఘటనపై తమకు ఇంతవరకు సమాచారం లేదని తెలిపారు. నావల్నీ న్యాయవాది ఖార్ప్ జైలు వద్దకు వెళుతున్నారని వెల్లడించారు.

కాగా, అలెక్సీ నావల్నీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు బద్ధ విరోధిగా ఉన్నారు. పుతిన్ విధానాలను, నిర్ణయాలను తీవ్రంగా విమర్శించే వారిలో నావల్నీ ముందు వరుసలో ఉంటారు. నావల్నీపై ఓసారి విమానంలో విషప్రయోగం జరగగా, మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చారు. కోలుకున్న అనంతరం జర్మనీ నుంచి తిరిగొచ్చిన ఆయనను 2021లో రష్యా ప్రభుత్వం కోర్టు బోనులో నిలబెట్టింది. అతడిని గుక్కతిప్పుకోనివ్వకుండా అనేక కేసులు పెట్టింది. ఈ కేసుల్లోనే నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. 

నావల్నీ చివరిసారిగా వాలెంటైన్స్ డే రోజున తన భార్య యులియా నావల్నీకి తన న్యాయవాదుల ద్వారా టెలిగ్రామ్ ప్రేమ సందేశం పంపారు. పుతిన్ ను ఎదిరించినవాళ్లు, ఆయనను తీవ్రంగా విమర్శించినవాళ్లు ఏదో ఒక రూపంలో ప్రాణాలు పోగొట్టుకుంటుండడం తెలిసిందే. అప్పుడు అలెక్సీ నావల్నీ కూడా ఆ జాబితాలో చేరారు.

More Telugu News