Harish Rao: నీకు చేతకాకుంటే దిగిపో... నేనే సీఎంగా చేసి చూపిస్తా: రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

  • నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తానన్న హరీశ్ రావు
  • నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటానన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • ఓట్లు, సీట్ల కోసం బురద రాజకీయమంటూ ఆగ్రహం
Harish Rao challenges CM Revanth Reddy

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో... నీకు చేతకాకుంటే దిగిపో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను రిపెయిర్ చేయలేమని చెబుతున్నారని, అలా చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలన్నారు. 'నేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డను పునరుద్ధరించి చూపిస్తా... అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోసే బాధ్యతను కూడా తీసుకుంటా'నని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

కాళేశ్వరం అంటే ఇదీ...

మేడిగడ్డతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయినట్లుగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు, లోక్ సభ ఎన్నికల్లో రెండు మూడు సీట్ల కోసం బురద రాజకీయానికి పాల్పడుతోందని ఆరోపించారు. వాస్తవానికి కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, పదిహేను రిజర్వాయర్‌లు, పందొమ్మిది సబ్ స్టేషన్లు, ఇరవై ఒక్క పంప్ హౌస్‌లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 1531 కిలో మీటర్ల గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటిది అన్నారు. వీటన్నింటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. ఎమ్మెల్యేలను తీసుకు వెళ్లినప్పుడు మేడిగడ్డతో పాటు మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ సాగర్, పంప్ హౌస్, కూడవెల్లి వాగు, పక్కనే ఉన్న పచ్చటి పొలాలను కూడా చూపిస్తే బాగుండేదన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణకు కాళేశ్వరం వరప్రదాయిని అన్నారు.

More Telugu News