Kinjarapu Ram Mohan Naidu: నాశనమైపోతున్న రాష్ట్రాన్ని కాపాడేందుకు ఇద్దరూ చేయి కలిపారు: రామ్మోహన్ నాయుడు

  • 2019లో జగన్ ను ఎన్నుకుని పెద్ద తప్పు చేశామన్న రామ్మోహన్ నాయుడు
  • వైసీపీ దొంగలను తరిమికొట్టడానికి చంద్రబాబు, పవన్ చేయి కలిపారని వ్యాఖ్య
  • సమస్యలపై పార్లమెంటులో పోరాడుతున్నామన్న యువ ఎంపీ
Chandrababu and Pawan Kalyan joined hands to protect AP says Ram Mohan Naidu

కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సైనికుల్లా తయారు చేయడానికి టీడీపీ యువనేత నారా లోకేశ్ శంఖారావం పూరించారని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. రేపు రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి ముఖ్యమైన ఎన్నికలని చెప్పారు. 2019లో జగన్ ను ఎన్నుకుని పెద్ద తప్పు చేశామని... ప్రజలంతా అరాచక ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భవిష్యత్తులో అవినీతిపరులకు చోటులేకుండా చేయాలని చెప్పారు. టీడీపీ-జనసేన కూటమిని ఘన విజయంతో గెలిపించాలని కోరారు. పాతపట్నం శంఖారావం సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పాతపట్నం నియోజకవర్గాన్ని టీడీపీ హయాంలో ఎంతో అభివృద్ధి చేసి చూపించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆనాడు గ్రామాల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు, పెన్షన్లు, పెళ్లి కానుక, చంద్రన్న బీమా వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తెచ్చి, యువతకు ఉద్యోగాలిచ్చిన ఘనత లోకేశ్ దని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఎక్కడా లేదని... గ్రావెల్, ఇసుక, మట్టి మైనింగ్ లో అవినీతి కోసం మాత్రం వైసీపీ నేతలు వాలిపోతున్నారని విమర్శించారు. అక్రమార్కులను తరిమికొడితేనే పాతపట్నం నియోజకవర్గం సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. ఏ కష్టమొచ్చినా మీ వెంట ఉంటానంటూ లోకేశ్ భరోసా ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ దొంగలను తరిమికొట్టడానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోరాడుతున్నారని అన్నారు. నాశనమైపోతున్న రాష్ట్రాన్ని కాపాడేందుకే వారిద్దరూ చేయిచేయి కలిపారని చెప్పారు. 

గ్రామ, క్షేత్రస్థాయిలో టీడీపీ-జనసేన కార్యకర్తలు కలిసి పని చేసి వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద అతి తక్కువ తలసరి ఆదాయం పాతపట్నం నియోజకవర్గంలో ఉందని... ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జిల్లా నుంచి వలస వెళ్లే వారిలో అత్యధికులు పాతపట్నం నియోజకవర్గంవారే ఉన్నారని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. యువతకు రుణాలు అందజేసి చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలని అన్నారు. 

నియోజకవర్గ పరిధిలో గిరిజన గ్రామాలు అధికంగా ఉన్నాయని, ఈ ప్రాంతంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని చెప్పారు. గిరిజన గ్రామాల ప్రజలు నమ్మి వైసీపీకి ఓటు వేసినందుకు వారిని నిండా ముంచేశారని దుయ్యబట్టారు. వంశధార నిర్వాసిత గ్రామాల్లో రూ. 431 కోట్ల యూత్ ప్యాకేజీని అందించిన ఘనత చంద్రబాబునాయుడిదని అన్నారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్... అధికారంలోకి వచ్చాక పంగనామాలు పెట్టి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పాతపట్నంలో రాజధాని ఎక్స్ ప్రెస్ ఆపేలా చర్యలు చేపడతామని చెప్పారు. సమస్యలపై పార్లమెంటులో పోరాడుతున్నామని తెలిపారు. శంఖారావంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయుడై మళ్లీ మా ప్రాంతానికి రావాలని లోకేశ్ ను కోరుకుంటున్నానని చెప్పారు.

More Telugu News