Student Suicide: సూర్యాపేట హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!

Intermediate girl student found dead at SC residential in Suryapet
  • హాస్టల్ గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన విద్యార్థిని
  • వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తరలించిన టీచర్లు
  • అప్పటికే చనిపోయిందని తేల్చిన ఆసుపత్రి వైద్యులు
  • ఫేర్ వెల్ పార్టీ పూర్తయిన తర్వాత గదికి వెళ్లి అఘాయిత్యం
సూర్యాపేట జిల్లా ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లో విషాదం చోటుచేసుకుంది.. ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం గమనించి వెంటనే కాపాడే ప్రయత్నం చేశామని, ఆసుపత్రికి తరలించేలోపే విద్యార్థిని చనిపోయిందని వార్డెన్ చెబుతున్నారు. అయితే, తమ కూతురిది ఆత్మహత్య కాదని, ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే చనిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే యాదాద్రి జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే తాజాగా సూర్యాపేటలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వసతి గృహాల్లో సౌకర్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరుగుతోంది.

ఇమాంపేటలోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్ వివరాల ప్రకారం.. శనివారం ఇంటర్ విద్యార్థుల ఫేర్ వెల్ పార్టీ జరిగింది. సాయంత్రం జరిగిన ఈ పార్టీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి ఉత్సాహంగా పాల్గొందని వార్డెన్ చెప్పారు. వైష్ణవి మిగతా విద్యార్థునులతోనూ బాగానే ఉండేదని, ఎలాంటి గొడవలులేవని తెలిపారు. పార్టీలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ పంచుతుండగా వైష్ణవి తన గదికి వెళ్లిపోయిందని, ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు వచ్చి చెప్పారన్నారు. దీంతో వెంటనే వెళ్లి వైష్ణవిని కిందికి దించామని, వైష్ణవి అప్పటికి ప్రాణాలతోనే ఉందని అన్నారు. 108 కు ఫోన్ చేసి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైష్ణవిని పరిశీలించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయిందని ప్రకటించారని వార్డెన్ మీడియాకు తెలిపారు.

Student Suicide
Inter Student
Suryapet District
Imampet
SC Residential Hostel

More Telugu News