ISRO: మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఫిబ్రవరి 17న శ్రీహరికోట నుంచి ప్రయోగం

  • జీఎస్‌ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ద్వారా ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధం 
  • మెరుగైన వాతావరణ అంచనాల లక్ష్యంగా ప్రయోగం
  • ప్రయోగానికి నిధులు సమకూర్చిన మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
ISRO to launch meteorological satellite GSLV F14 for better weather forecasts

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం  జీఎస్‌ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ (GSLV-F14/INSAT-3DS) ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17, 2024న సాయంత్రం 5:30 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్14‌ రాకెట్ ను ప్రయోగించనుంది. ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ‘ఎక్స్’ వేదికగా ఇస్రో షేర్ చేసింది. జీఎస్‌ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని ఇస్రో వెల్లడించింది.

వాతావరణ పరిశీలన కోసం ఇస్రో ఈ 'ఇన్సాట్-3డీఎస్' ఉపగ్రహాన్ని రూపొందించింది. మెరుగైన రీతిలో వాతావరణ పరిశీలనలు, వాతావరణ అంచనాలతో పాటు భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షణకు ఉపయోగడపడనుంది. వాతావరణ విపత్తులను మరింత మెరుగ్గా అంచనా వేసి అప్రమత్తమవ్వడం కూడా ఒక ప్రధాన లక్ష్యంగా ఉంది. కాగా మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ ప్రయోగానికి అవసరమైన నిధులను సమకూర్చింది. భారత వాతావరణ విభాగం (IMD), ఎన్‌సీఎంఆర్‌డబ్ల్యూఎఫ్ (నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్), విభాగాలు వాతావరణ అంచనాల కోసం ఇన్సాట్-3డీఎస్ డేటాను ఉపయోగించుకోనున్నాయి.

More Telugu News