తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారు: ఈటల రాజేందర్

  • కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని ధీమా
  • తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ, మోదీ రావాలని కోరుకుంటున్నారన్న ఈటల
  • సంకీర్ణ ప్రభుత్వాల అవసరం లేకుండా చేసిన ఘనత ప్రధాని మోదీదే అన్న బీజేపీ నేత
తెలంగాణ ప్రజలు ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికే పట్టం కట్టబోతున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం నర్సంపేటలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్రంలో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్‌లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా కేంద్రంలో బీజేపీ, మోదీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. భారత రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల అవసరం లేకుండా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అన్నారు. 

నరేంద్ర మోదీ వల్ల ప్రపంచంలో భారత దేశానికి మరింత గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణలో దళిత బంధు, బీసీ బంధులతో ప్రజలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Etela Rajender
BJP
Telangana
Narendra Modi

More Telugu News