Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే... చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయి: బొండా ఉమ

Bonda Uma fires on CM Jagan
Advertisement
  • మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బొండా ఉమ ప్రెస్ మీట్
  • సొంత చెల్లే జగన్ గుట్టు బయట పెట్టిందని వెల్లడి
  • షర్మిల చెప్పిన విషయాలపై జగన్ లై డిటెక్టర్ పరీక్ష చేయించుకోవాలన్న ఉమ
  • ఆడపడుచు వ్యాఖ్యలపై భారతిరెడ్డి నోరు విప్పాలని డిమాండ్
Advertisement
జగన్ రెడ్డి చీకటి వ్యవహారాల్లోనూ, లాబీయింగ్ చేయడంలోనూ దిట్ట అనడానికి బెయిల్ కోసం సోనియాతో నడిపిన మంత్రాంగమే నిదర్శనం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ ఆరోపించారు. జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే... అతని చీకటి వ్యవహారాలు బయటకు వస్తున్నాయని అన్నారు. 

డబ్బు పిచ్చి, అధికారం కోసం జగన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు అనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనం అని స్పష్టం చేశారు. జగన్ బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్ సోనియాను కలిశారన్న షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడు? అంటూ బొండా ఉమ నిలదీశారు. 

జగన్ ఎలాంటి వాడో అప్పుడే చెప్పాం!

జగన్ రెడ్డి ఎలాంటివాడో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. జగన్ అవినీతి, కేసుల నుంచి బయటపడటానికి అతను ఢిల్లీ పెద్దలతో జరిపిన వ్యవహారాలు, తెరవెనుక జరిపిన మంత్రాంగాలు సహా అనేక విషయాలు బయటపెడితే, టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది అన్నారు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు మా పార్టీ అభిప్రాయాల్ని, వాదనను అడ్డగోలుగా బుకాయించారు. 

ఇప్పుడు సొంత చెల్లే గుట్టు బయటపెట్టింది!

ఇవాళ సొంత చెల్లే జగన్ రెడ్డి గుట్టు బయటపెట్టింది. అధికారంలోకి రాకముందు జగన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలని, ప్రజల్ని మోసగించడానికి కట్టుకథలు అల్లాడని నేడు ఆయన చెల్లి షర్మిల వ్యాఖ్యలతో తేలిపోయింది. షర్మిల చెప్పేది నిజమో... లేక జగన్ రెడ్డి చెప్పింది నిజమో తెలియాలంటే లైడిటెక్టర్ పరీక్షలు చేయించాలి. జగన్ రెడ్డే స్వయంగా లైడిటెక్టర్ పరీక్షలు చేయించుకోవాలి. అప్పుడే జగన్ నోటినుంచి అసలైన నిజాలు బయటకు వస్తాయి. 

అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్ రెడ్డికి న్యాయస్థానాల్లో బెయిల్ రాకపోవడంతో, తన బావ బ్రదర్ అనిల్ కుమార్, భార్య భారతిని సోనియా గాంధీ వద్దకు పంపి, జగన్ బెయిల్ పొందాడన్నది వాస్తవం. ఇదే నిజాన్ని షర్మిల బయటపెట్టింది. జగన్ రెడ్డి చెల్లి తాజాగా బయటపెట్టిన నిజాలు.. ఎప్పటినుంచో టీడీపీ చెబుతున్న వాస్తవాలు ఒక్కటేనని ఇప్పుడు తేలిపోయింది. తనపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతాడు? 

తన ఆడపడుచు షర్మిల వ్యాఖ్యలపై భారతిరెడ్డి తక్షణమే నోరు విప్పాలి

తనపై కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా కేసులు పెట్టిందని, అప్పటి కేంద్రప్రభుత్వం (కాంగ్రెస్ ప్రభుత్వం) తనపై కక్షతో వ్యవహరించిందని, తనపై పెట్టిన కేసుల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని జగన్ రెడ్డి బొంకాడు. ఇప్పటికీ వైసీపీ నేతలు అదే వల్లె వేస్తుంటారు. మరిప్పుడు సొంతచెల్లి షర్మిల చెబుతున్న నిజాలపై జగన్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ ఏం సమాధానం చెబుతారు? 

తన ఆడపడుచు షర్మిల బయటపెట్టిన నిజాలపై జగన్ భార్య భారతి ఎందుకు నోరువిప్పడం లేదు? జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఆయన భార్య భారతి రెడ్డి, షర్మిల భర్త అనిల్ కుమార్ ను వెంట బెట్టుకొని సోనియాగాంధీ వద్దకు ఎందుకు వెళ్లింది? ఏం మాట్లాడటానికి వెళ్లిందో భారతిరెడ్డి చెప్పాలి. షర్మిల వ్యాఖ్యలపై భారతిరెడ్డి తక్షణమే నోరువిప్పాలి. బ్రదర్ అనిల్ కుమార్ ను వెంటబెట్టుకొని వెళ్లి మరీ సోనియాగాంధీతో తాను మాట్లాడిన వివరాల్ని భారతిరెడ్డి వెంటనే బహిర్గతం చేయాలి.
  
తల్లి కూడా త్వరలోనే జగన్ భాగోతం ప్రజల ముందు పెడుతుంది

ఏ వ్యాపారం చేసి ఇంత సొమ్ము సంపాదించాడో జగన్ రెడ్డి చెప్పాలి. లక్షలకోట్లున్న జగన్ రెడ్డి పేదవాడా? ప్రజల సొమ్ము బొక్కేసి, రాష్ట్రాన్ని లూటీ చేసిన పెత్తందారు జగన్ రెడ్డి. సాక్షి పత్రిక నాది కాదు.. టీవీ చానల్ నాది కాదు... నేను పేదవాడిని... అనే కాకమ్మకబుర్లతో ఎన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తావు జగన్ రెడ్డి? జగన్ రెడ్డి పాపాలు పండాయి కాబట్టే నేడు అతని చీకటి వ్యవహారాల్ని సొంత చెల్లి షర్మిల బయటపెట్టింది. ఆమెతో  పాటు... త్వరలోనే జగన్ తల్లి కూడా ఆయన భాగోతం ప్రజల ముందు పెడుతుంది.
Advertisement
Advertisement
Bonda Uma
Jagan
Sharmila
TDP
YSRCP
Congress
Andhra Pradesh

More Telugu News