BJP: లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి మరో ఘన విజయం.. మండిపడ్డ కేజ్రీవాల్

  • మెజార్టీ లేకపోయినా చండీగఢ్ మేయర్ పదవిని కైవసం చేసుకున్న బీజేపీ
  • మేయర్ ఎన్నికల్లో చెల్లని 8 ఓట్లు
  • లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఏ స్థాయికైనా వెళ్తుందని కేజ్రీవాల్ ఆందోళన
BJP wins Chandigarh Mayor election

యావత్ దేశం లోక్ సభ ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో మోదీకి చెక్ పెట్టాలని ఇండియా కూటమి సర్వశక్తులను ఒడ్డే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీకి గొప్ప ఊరట లభించింది. చండీగఢ్ మేయర్ ఎలెక్షన్లో బీజేపీ విజయం సాధించింది. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ ను ఓడించింది. ఇండియా కూటమి కాంగ్రెస్, ఆప్ ఉమ్మడి అభ్యర్థిపై విజయం సాధించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్డీయే చెంతకు చేరిన వెంటనే ఈ విజయాన్ని బీజేపీ సాధించడం గమనార్హం. 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సోంకర్ కు 16 ఓట్లు రాగా.. కుల్దీప్ కుమార్ కు 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లనివిగా ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి ఆప్ కు 13 మంది, కాంగ్రెస్ కు 7 మంది మంది కౌన్సిలర్లు ఉండగా... బీజేపీకి 14 మంది ఉన్నారు. అయినప్పటికీ మేయర్ ఎన్నికల్లో గెలుపొందేలా బీజేపీ మేనేజ్ చేసింది. 

మరోవైపు ఎన్నికల ఫలితాలపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీజేపీ మోసపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మేయర్ ఎన్నికల్లోనే బీజేపీ ఈ స్థాయికి దిగజారితే... రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ స్థాయికైనా వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News