Shamar Joseph: సెక్యూరిటీగార్డు నుంచి బౌలర్ దాకా.. ఆస్ట్రేలియా వెన్ను విరిచిన షమర్ జోసెఫ్ స్ఫూర్తిదాయక గాథ !

Who is Shamar Joseph the ex security officer scripts record in Australia
షార్ట్స్‌లో చూడండి
ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన రెండో టెస్టులో విండీస్ చిరస్మరణీయ విజయం వెనక ఉన్న బౌలర్ షమర్ జోసెఫ్‌‌ది నిజంగా స్ఫూర్తిదాయక గాథ. కేవలం 350 మంది నివసించే ఓ కుగ్రామంలోని నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన జోసెఫ్ ఆసీస్‌ను సొంతగడ్డపైనే మట్టి కరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ మాత్రమే తీసిన జోసెఫ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చెలరేగాడు. 68 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి జట్టుకు చారిత్రక విజయం అందించిపెట్టాడు.

గతేడాది వరకు సెక్యూరిటీ గార్డుగా
చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న జోసెఫ్ ఎలాగైనా జాతీయ జట్టుకు ఆడాలని కలలు కనేవాడు. విండీస్ దిగ్గజ పేసర్లు ఆంబ్రోస్, వాల్ష్ అంటే ఇష్టపడేవాడు. స్నేహితుల దగ్గర ఎప్పుడైనా బంతి దొరికితే దానిని పట్టుకుని సంధించేందుకు ప్రయత్నించేవాడు. వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడుతూ డబ్బులు సంపాదించి ఇంట్లో ఇచ్చేవాడు. అయినా, ఇల్లు గడిచేది కాదు, దీంతో ఓ కోత మిషన్ వద్ద పనికి కుదిరాడు. ఈ క్రమంలో ఓసారి చెట్టును కొట్టే ప్రయత్నంలో అది కూలడంతో జోసెఫ్ ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి సెక్యూరిటీగార్డుగా చేరాడు. ఆ పనిలో ఉంటూనే వీలైనప్పుడల్లా క్రికెట్ ఆడేవాడు. గతేడాది వరకు అతడు సెక్యూరిటీ గార్డుగానే పనిచేశాడు.

టర్నింగ్ పాయింట్
ఎలాంటి శిక్షణ లేకపోయినా అద్భుతంగా బంతులు సంధిస్తూ వికెట్లు తీస్తున్న జోసెఫ్‌పై‌ను గయానా హార్పీ ఈగల్స్ జట్టు యాజమాన్యం గుర్తించింది. గతేడాది ఫిబ్రవరిలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించింది. అలా ఈగల్స్ జట్టుకు ఆడిన జోసెఫ్ మూడు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడే చాన్స్ వచ్చింది. అందులోనూ ఆకట్టుకోవడంతో దక్షిణాఫ్రికా జూనియర్ జట్టు పర్యటనలో విండీస్-ఎ జట్టులో చోటు దక్కింది. ఆ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియాలో పర్యటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

తొలి టెస్టులోనే సత్తా
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో తొలి బంతికే స్టార్ బ్యాటర్ స్మిత్ వికెట్ తీసి అరంగేట్రాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు తీసి ఐదు వికెట్ల ప్రదర్శన భళా అనిపించుకున్నాడు. 24 ఏళ్ల జోసెఫ్ పేస్‌కు స్వింగ్‌ను జతచేసి బంతులను బుల్లెట్లుగా మార్చేవాడు. స్లో ఆఫ్ కటర్స్, స్లో బౌన్సర్లతో కంగారూలను కంగారు పెట్టాడు. రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించి తనలోని ప్రతిభ గాలివాటం కాదని నిరూపించుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత కరీబియన్ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించిపెట్టిన జోసెఫ్‌పై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Go Back to Shorts
Shamar Joseph
Team West Indies
Team Australia

More Telugu News