Chandrababu: గల్లా జయదేవ్ రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి: చంద్రబాబు

  • నెల్లూరులో రా కదలిరా సభ
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు
  • గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని ప్రస్తావించిన వైనం
  • ప్రజలే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని స్పష్టీకరణ
  • మూడు రెక్కలు విరిచి మొండి ఫ్యాను చేతిలో పెడతారని వ్యాఖ్యలు
Chandrababu mentions Galla Jayadev send off to politics issue in Nellore Raa Kadali Raa meeting

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరులో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధితులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లా జయదేవ్ వంటి వ్యక్తి కూడా బాధితుడయ్యాడని తెలిపారు.

గల్లా జయదేవ్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని వెల్లడించారు. అమరరాజా పరిశ్రమపై దాడులు చేసి వేరే రాష్ట్రానికి పారిపోయేలా చేశారని వివరించారు. ఒక రాజకీయ కుటుంబం రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 

వైసీపీ పాలనలో ప్రజల జీవితాలలో మార్పు అనేదే లేదని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో  ఏపీ అగ్రస్థానానికి చేరిందని, రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీనే ముందుందని వివరించారు. నిరుద్యోగం విషయంలోనూ ఏపీ మిగతా రాష్ట్రాలను వెనక్కి నెట్టిందని, 24 శాతంతో అగ్రస్థానంలో ఉందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కంటే జగన్ రిచ్ గా తయారయ్యారని, కానీ తాను మాత్రం పేదబిడ్డనని చెప్పుకుంటుంటారని ఎద్దేవా చేశారు. 

జగన్ అభిమన్యుడు కాదని, భస్మాసురుడు అని వ్యంగ్యం ప్రదర్శించారు. భస్మాసుర వధ చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజలది అని స్పష్టం చేశారు. 

"ప్రజలు తొందర్లోనే నీ ఫ్యాను మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు... నీ ఫ్యానులో బాదుడు రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు... నీ హింసా రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు... నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు. చివరికి నీకు మిగిలేది మొండి ఫ్యాను! ఆ మొండి ఫ్యానును ప్రజలు నీ చేతుల్లో పెట్టి నీ రివర్స్ పాలనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు... తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా  కూర్చుని బాధపడే రోజు తొందరల్లోనే వస్తుంది.... సిద్ధంగా ఉండు జగన్ రెడ్డీ!" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

More Telugu News