Narendra Modi: కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు

  • తొలిసారి ఓటర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
  • అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా యువత ఉందన్న ప్రధాని మోదీ
  • మీ ఓటు బలంతో కుటుంబ పార్టీలను ఓడించాలన్న మోదీ
PM Modis call to first time voters

కుటుంబ పార్టీలను... రాజకీయాలను ఓడించేందుకు మీ ఓటు అనే శక్తిని ఉపయోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ యువ ఓటర్లను కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కొత్త ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువ ఓటర్లే అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా యువత ఉన్నారన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీల నేతల ఆలోచనలు... విధానం మాత్రం యువతకు వ్యతిరేకంగా ఉంటోందన్నారు. కుటుంబ పార్టీలను మీ ఓట్ల బలంతో ఓడించాలని యువతకు పిలుపునిచ్చారు.

ఓటరు జాబితాలో మీ పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఇప్పుడు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించనున్నారని పేర్కొన్నారు. మన దేశం అమృత్‌కాల్ దిశగా వెళుతోన్న తరుణంలో మీరంతా ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నారన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో మీ బాధ్యత కొనసాగుతుందన్నారు. అభివృద్ధి భారతంలో మీ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి మీ అందరికీ ఇదో గొప్ప అవకాశమన్నారు. భారత అభివృద్ధి వేగం, దిశ, విధానం నిర్ణయించడంలో మీదే అసలైన పాత్ర అన్నారు. ఇందుకు ఓటు సరైన ఆయుధం అన్నారు.

కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్థిరమైన, పూర్తి మెజార్టీ ప్రభుత్వం అవసరమన్నారు. మీ ఒక్క ఓటుకు చాలా పెద్ద శక్తి ఉంటుందని... దేశంలో స్థిరమైన, పూర్తి మెజార్టీ ప్రభుత్వం ఉంటే దేశానికి మంచి జరిగే కీలక నిర్ణయాలు తీసుకోగలదని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల పెంపు, స్టార్టప్స్ వంటి వాటి వల్ల యువతకు అపారమైన అవకాశాలు వస్తున్నాయన్నారు. మీ కలలే నా సంకల్పం... ఇది నా హామీ.. యువతే తన ప్రాధాన్యత అని ప్రధాని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొనడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News