Nara Lokesh: ఓటే మనందరి ఆయుధం: నారా లోకేశ్

  • నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
  • సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకమన్న లోకేశ్ 
  • త్వరలో ఏర్పడే ప్రజా ప్రభుత్వానికి మద్దతివ్వాలని పిలుపు
Nara Lokesh stated that vote is our weapon

రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

మన ఓటే మన భవిష్యత్తు అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. వైసీపీ నిరంకుశత్వ పాలన పోవాలంటే ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతీ, యువకులంతా స్వచ్ఛందంగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు-జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యంలో యువతరం ఆకాంక్షలు, ఆశయాలను నెరవేర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. 

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు, సంపద పెంపుతో మెరుగైన సంక్షేమం కావాలంటే... తెలుగుదేశం-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించాలని నారా లోకేశ్ కోరారు. ప్రతి జిల్లా సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ టీడీపీకే సాధ్యమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏర్పాటు కానున్న ప్రజా ప్రభుత్వంలో అంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. 

ప్రజల భవిష్యత్ వారి ఓటు పైనే ఆధారపడి ఉందని, దీని ప్రాధాన్యతను అంతా గుర్తెరగాలని స్పష్టం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

More Telugu News