Amazon: అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో అమెజాన్‌లో స్వీట్ల విక్రయం.. వార్నింగ్ ఇచ్చిన సీసీపీఏ

  • అమెజాన్‌కు నోటీసులు పంపిన వినియోగదారుల వాచ్‌డాగ్
  • వారం రోజుల్లో స్పందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
  • ఆయా సెల్లర్ల సేల్స్ ఆప్షన్స్‌ను తొలగించామన్న అమెజాన్
Amazon removed sales options of Ram Mandir prasad

అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో తమ ప్లాట్‌ఫాంలో స్వీట్లు విక్రయిస్తున్న సంస్థలపై ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ చర్యలు తీసుకుంది. విక్రయదారుల సేల్స్ ఆప్షన్‌ను తొలగించింది. అమెజాన్‌లో కొందరు వ్యాపారులు ‘శ్రీ రాం మందిర్ అయోధ్య ప్రసాదం’ పేరుతో స్వీట్లు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న విషయం తమ దృష్టికి రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్‌కు నోటీసులు పంపింది.

వారం రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబోయే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసులపై అమెజాన్ స్పందించింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి తెలిపారు. సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను తొలగించినట్టు చెప్పారు. 

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావించి ‘రఘుపతి ఘీ లడ్డూ’, ‘అయోధ్య రాం మందిర ప్రసాదం’, ‘ఖోయా ఖోబీ లడ్డూ’, ‘రాం మందిర్ అయోధ్య ప్రసాదం- స్వదేశీ ఆవు పేడా (స్వీట్) పేరుతో అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. సీసీపీఏ నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్‌ను అమెజాన్ నిలిపివేసింది.

More Telugu News