వైఎస్ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై విచారణ వచ్చే నెలలో చేబడతామన్న సుప్రీంకోర్టు
- పిటిషన్ ను ఫిబ్రవరిలో విచారిస్తామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం
- గత ఏడాది మే 31న అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు
- హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్ సునీత
ఈ పిటిషన్ పై గత ఏడాది జులై 18న, ఆ తర్వాత సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును లోతుగా చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ తర్వాత విచారణ జరగలేదు. ప్రతి నెల సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో కేసు విచారణ తేదీలు కనపడుతున్నప్పటికీ ఆ తర్వాత డిలీట్ అయిపోతున్నాయి.
తాజాగా, జనవరి 16, 17, 18 తేదీల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేర్కొంది. అయినప్పటికీ ఈ రోజు కూడా విచారణకు రాకపోవడంతో ఈ విషయాన్ని... వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పుడు విచారిస్తారో తేదీలను వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పిటిషన్ ను విచారిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. అయితే ఏ తేదీన విచారణ చేపడతారనేది మాత్రం ధర్మాసనం వెల్లడించలేదు. ఈ సాయంత్రానికి తేదీలు తెలిసే అవకాశం ఉంది.