Chandrababu: రాతియుగ పాలనకు ముగింపు పలుకుతూ.. స్వర్ణ యుగానికి నాంది పలుకుదాం.. తెలుగు ప్రజలకు చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు

  • సంకాంత్రి ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదన్న టీడీపీ అధినేత
  • మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశం ఇస్తుందన్న చంద్రబాబు
  • పండుగ కానుకలను ఈ ప్రభుత్వం దూరం చేసి సంతోషాన్ని దూరం చేసిందని మండిపాటు
TDP Chief Chandrababu Wishes Telugu People Happy Sankranti

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి సంకేతమైన సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామని, ఇది ప్రకృతిలో జరిగే మార్పు మాత్రమే కాదని, మన జీవితంలోనూ ప్రగతితో కూడిన మార్పు రావాలన్న సందేశాన్ని సంక్రాంతి పండుగ ఇస్తుందని పేర్కొన్నారు. 

విధ్వంస పాలనతో ఏపీ ప్రజల జీవితాలు చీకటిమయం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటకు మద్దతు ధర లేదని, నిత్యావసర ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీశాయని అన్నారు. ఉపాధి, ఉద్యోగాలు లేని కుటుంబాలు, అస్తవ్యస్తమైన రోడ్లు, భయపెడుతున్న ఆర్టీసీ చార్జీలు గ్రామాల్లో పండుగ శోభను దెబ్బతీశాయన్నారు. 

ప్రతి పేద కుటుంబం పండగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో తమ హయాంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కానుకలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసి పండుగ సంతోషాలను ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు.

కొత్త మార్పుకు పండుగ బాటలు వేయాలి
బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కలుసుకునే ఈ సంక్రాంతి పండుగ కొత్త మార్పుకు బాటలు వేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని చీకట్లు తొలగిపోయేలా, ప్రజల్లో కొత్తకాంతి నిండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజ హితం, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించి సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలుకుతూ, స్వర్ణయుగానికి నాంది పలికేలా ప్రజలంతా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ‘రండి! కదలి రండి! రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేం చేసే పోరాటంలో భాగస్వాములవ్వండి. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దాం’ అని పిలుపునిస్తూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News