Dhruv Jurel: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికై ఆశ్చర్యపరిచిన బ్యాట్స్‌మెన్ ధృవ్ జురెల్ ఎవరు?.. అతడి విశేషాలు ఇవిగో!

  • దేశవాళీ క్రికెట్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 790 పరుగులు చేసిన యువ కెరటం
  • ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021’లో ఉత్తరప్రదేశ్ తరపున ఎంట్రీ
  • ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేయడంతో తొలిసారి వినిపించిన పేరు
  • భారీ షాట్లు ఆడగలిగే సామర్థ్యంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ధృవ్ జురెల్
Who is the Dhruv Jurel selected for the Test series against England by BCCI Selectors

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ప్రకటించిన ఆటగాళ్ల జాబితాలో ఒక పేరు చాలామందిని ఆశ్చర్యపరిచింది. మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్ల పేర్లు లేకపోవడమే సర్‌ప్రైజ్ అనుకుంటే, అంతకుమించి 'ధృవ్ జురెల్' అనే పేరు కనిపించడంతో చాలామంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ యువ బ్యాట్స్‌మెన్-కీపర్ ఎవరు? అతడి క్రికెట్ రికార్డులు ఎలా ఉన్నాయి? అని గూగుల్‌లో అన్వేషిస్తున్నారు. ఇషాన్ కిషన్ విశ్రాంతి తీసుకోవడంతో జురెల్‌ను మూడవ వికెట్ కీపర్ ఛాయిస్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. సంజూ శాంసన్ అందుబాటులో ఉన్నప్పటికీ అతడిని పక్కనపెట్టి ఎంపిక చేసిన ఈ యువకెరటం గురించి తెలుసుకుందాం..

22 ఏళ్ల వయసున్న ఈ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ 21 జనవరి 2001న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో అతడి  రికార్డుల గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దేశీవాళీ టీ20 టోర్నమెంట్‌ ‘సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021’లో ఉత్తరప్రదేశ్ తరపున ధృవ్ బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై 23 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఆకట్టుకునేలా ఆడాడు. ఇక రంజీ ట్రోఫీలో విదర్భతో మ్యాచ్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ఆరంభించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 64 పరుగులు చేసి మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ధృవ్ కేవలం 15 మ్యాచ్‌లు మాత్రమే ఆడడంతో చెప్పకోదగ్గ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఏమీ లేవు. 46.47 సగటుతో 790 పరుగులు చేయగా 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ 2024 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో జురెల్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడి 47.25 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 137.07 స్ట్రయిక్ రేట్‌తో 244 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ తరపున అరంగేట్రం చేసినప్పుడు ధృవ్ జురెల్ పేరు మొదటిసారి బాగా వినిపించింది. పెద్ద పెద్ద షాట్లు ఆడగల నైపుణ్యమున్న ఈ ఆటగాడు వికెట్ కీపర్‌గా రాణిస్తున్నాడు. దీంతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ యువకెరటాన్ని రూ.20 లక్షల బేస్ ధరకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. గత ఐపీఎల్ ఎడిషన్‌లో జురెల్ 11 మ్యాచ్‌లు ఆడి 152 పరుగులు కొట్టాడు. 172.72 స్ట్రయిక్ రేట్‌తో భారీ షాట్లు కొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

More Telugu News