Infosys: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

  • మొత్తం పెళ్లిఖర్చు రూ. 800
  • చెరిసగం పంచుకున్న సుధ, నారాయణమూర్తి
  • పెళ్లికి అతిథులు ఏడుగురే
  • అరగంటలోనే పూర్తయిన వివాహం
  • ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న సుధామూర్తి
Inspiring story of infosys Narayanamurthy and Sudhamurthy

ఐటీరంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వారిలో ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి ఒకరు. సంస్థను స్థాపించిన తొలినాళ్లలో ఆయన పడిన కష్టాలు ఎలా ఉండేవో ఇటీవల విడుదల ఆయన ఆత్మకథ ‘యాన్ అన్‌కామన్ లవ్: ద ఎర్లీలైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తి’లో వెల్లడించారు. తాజాగా, నారాయణమూర్తి, సుధామూర్తి వివాహానికి అయిన ఖర్చుకు సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చింది. వారి పెళ్లి ఖర్చు రూ.800 మాత్రమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ విషయాన్ని సుధామూర్తి స్వయంగా వెల్లడించారు. 

వివాహాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ చెరో రూ. 400 ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, ఈ పెళ్లికి హాజరైన అతిథులు కూడా ఏడుగురేనంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి సమయంలో నారాయణమూర్తి కుటుంబ సభ్యులు రూ. 300 ఇస్తామని, చీర కావాలా? మంగళసూత్రం కావాలా? అని అడిగితే సుధామూర్తి మంగళసూత్రం కావాలని అడిగారట. అరగంటలోనే పెళ్లి పూర్తయింది. అప్పట్లో మూర్తి దగ్గర డబ్బులు లేకపోయేవని, దీంతో తానే ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చేదని సుధామూర్తి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

నారాయణమూర్తి మాట్లాడుతూ.. సుధను ఇన్ఫోసిస్‌కు దూరం పెట్టి చాలా తప్పుచేశానని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సంస్థలోని ఆరుగురు వ్యవస్థాపకులు, తన కంటే కూడా ఆమే ఎక్కువ అర్హురాలని చెప్పారు. మంచి కార్పొరేట్ పాలన అంటే కుటుంబ సభ్యులను సంస్థకు దూరంగా ఉంచడమేనని అనుకునేవాడినని, ఆ రోజుల్లో వారసులు వచ్చి సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవారని గుర్తు చేసుకున్నారు. 

అయితే, కొందరు ప్రొఫెసర్లతో మాట్లాడినప్పుడు తన నిర్ణయం తప్పని చెప్పారని పేర్కొన్నారు. సుధను కలిసేందుకు టికెట్ లేకుండా ఒకసారి రైలులో 11 గంటలు ప్రయాణించిన విషయాన్ని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ప్రేమలో ఉండడంతో శరీరంలోని హార్మోన్లు ఉరకలెత్తేవని చెబుతూ నవ్వేశారు.

More Telugu News