Ponguleti Srinivas Reddy: మా కార్యకర్తలకు తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలున్నాయి: మంత్రి పొంగులేటి భావోద్వేగం

  • రాజకీయ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డానని... అవమానాలు భరించానన్న పొంగులేటి
  • కార్యకర్తల ముందు బాధపడితే నిరాశకు లోనవుతారని దిగమింగుకున్నానని వ్యాఖ్య
  • మా కష్టం వృథాగా పోలేదన్న పొంగులేటి
  • ఇప్పుడు మంత్రిగా ఉన్నతమైన స్థానంలో ఉన్నానన్న పొంగులేటి
Minister Ponguleti Srinivas Reddy emotional

కొన్నిసార్లు కార్యకర్తలకు తెలియకుండా తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం కూడా ఉందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం అన్నారు. భక్త రామదాసు కళాక్షేత్రంలో గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఓ సమయంలో భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయ జీవితంలో తాను ఎన్నో కష్టాలు పడ్డానని... అనేక అవమానాలు భరించానన్నారు.

అనేక సందర్భాలలో తన కార్యకర్తలు బాధపడ్డారని.. కన్నీళ్లు పెట్టుకునే వారని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారి ముందు నేను బాధపడితే నిరాశకు లోనవుతారని... తాను అన్నీ దిగమింగుకొని వారు లేని సందర్భాలలో కన్నీరు పెట్టుకున్నానని భావోద్వేగంతో చెప్పారు. తన కన్నీరు... కష్టం వృథా పోలేదన్నారు. ప్రతి కష్టం వెనుక సుఖం ఉంటుందని... ప్రతి సుఖం వెనుక కష్టం ఉంటుందని తెలుసుకోవాలనే తాను ఇది చెబుతున్నానన్నారు. మన మంచి మనకు ఎప్పుడూ శ్రీరామరక్షలా ఉంటుందన్నారు.

తాను ప్రస్తుతం మంత్రిగా ఓ ఉన్నతమైన స్థానంలో ఉన్నానని... అయితే తాను ఆ రోజు పొందిన ఎమోషన్‌కు అర్థం లేదని.. కానీ ఈ రోజు పొందిన ఎమోషన్‌ను మీరంతా గ్రహించాలన్నారు. ఆ రోజే నేను బాధపడితే నా వెంట ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు నిరుత్సాహపడతారని తాను వారిముందు ధైర్యంగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో అందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఎన్ని ఇబ్బందులుపడినా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పునరుద్ఘాటించారు.

More Telugu News